సర్వేపై సందిగ్ధం
రీ సర్వే ఎప్పుడో?
ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందుతున్నాయా అని నిర్ధారించేందుకు జిల్లాలో నిర్వహించిన గ్రామ సభలు లబ్ధిదారుల పేర్లు చదివేందుకే పరిమితమయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతీ చోట అవకతవకలు జరిగాయని నిజమైన లబ్ధిదారులను విస్మరించారని గొడవలు జరిగాయి. బయ్యారం గ్రామంలో మళ్లీ సర్వే చేసి లబ్ధిదారుల జాబితా కొత్తగా ప్రకటించిన తర్వాతే లబ్ధిదారులను ఎంపిక చేయాలని గ్రామ సభలో తీర్మానం కూడా చేశారు. ఇలా జిల్లాలో నాలుగు రోజులు 487 గ్రామ పంచాయతీలు, మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ నాలుగు మున్సిపాలిటీల్లోని 82 వార్డులు కలుపుకొని జిల్లాలో మొత్తం 569 గ్రామ సభలు జరిగాయి. ఈ సభల్లో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కోసం మొత్తం 86,237 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరందరి దరఖాస్తులు పునఃపరిశీలించి తప్పులు లేకుండా సర్వే చేస్తే తప్పా.. నిజమైన లబ్ధిదారుల ఎంపిక కాదని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
సాక్షి, మహబూబాబాద్
● ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళలు మహబూబాబాద్ మండలంలోని పర్వతగిరి గ్రామానికి చెందిన పూల వసంత, ఉషారాణి. గత కొంత కాలం క్రితం తండ్రి నారాయణ తల్లీ, ఇద్దరు కుమార్తెలను విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇద్దరు పిల్లలతో తల్లి దనమ్మ పాత గోడలపై రేకులు వేసుకొని ఉంటున్నారు. నిలువ నీడలేని కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు వస్తుందంటే దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఈ కుటుంబం పేరు ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా జాబితాలో లేదు. ఇది జరిగిన మరుసటి రోజే తల్లి ధనమ్మ మరణించింది. ఇద్దరు ఆడపిల్ల లు ఉన్న ఈ కుటుంబానికి ఇల్లు రాకపోవడం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నించారు. అధికారులను అడిగితే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పారే తప్పా ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదని, పెద్దలు స్పందించి ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నారు.
● ‘నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన సమ్మెట రమేశ్‌కు గ్రామంలో ఉన్న ఇల్లు కూలిపోయింది. ఖాళీ జాగలో ఉండలేక వేరే వాళ్ల ఇంటిలో అద్దెకు ఉంటున్నాడు. గత ప్రభుత్వం రెండు పడకల ఇల్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. అంతలోనే ఎన్నికలు వచ్చాయి. ఇల్లు ఊసే లేకుండా పోయింది. కొత్త ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. ఇంటికి అధికారులు వచ్చి సర్వే చేశారు. ఖాళీ ప్లాట్‌లో ఫొటో దింపారు. ఏం జరిగిందో ఏమో కానీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు జాబి తాలో రమేశ్ పేరు లేదు. ఏం జరిగిందని అధికారులను అడుగగా.. పొరపాటు జరిగింది. మరోసారి దరఖాస్తు చేసుకో.. ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. గ్రామసభలో మళ్లీ దరఖాస్తు చేసుకున్న రమేశ్ మూడు రోజుల నుంచి ఎంపీడీఓ కార్యాలయం చుట్టు తిరిగినా పట్టించుకున్న వారు లేరు.. మళ్లీ సర్వే ఎప్పుడు చేస్తారని అడుగగా సర్వేలేదు.. ఏం లేదని అక్కడ ఉన్నవారు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.’
ఇలా జిల్లాలోని ఏ గ్రామంలో చూసిన ఇటువంటి సంఘటనలే చోటు చేసుకుంటున్నాయి. దీంతో గ్రామసభలు గందరగోళంగా సాగాయి. అయితే మళ్లీ దరఖాస్తు చేసుకోండి అని చెప్పిన అధికారులు రీ సర్వే ఎప్పుడు చేస్తారనే విషయం చెప్పేందుకు మాత్రం సహసం చేయడం లేదు. దీంతో అన్ని అర్హతలు ఉన్నా.. తమ పేరు ఎందుకులేదని, మళ్లీ సర్వే చేయాలని నిరుపేదలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. పట్టించుకున్న వారే కరువయ్యారు.
కొంప ముంచిన డిజిటల్ యాప్
ప్రభుత్వం అమలు చేసే పథకాల లబ్ధిదారుల ఎంపికకు పదిరోజులుగా సర్వే నిర్వహించారు. ఈ సర్వే సందర్భంగా సదరు లబ్ధిదారుడి ల్యాండ్ మార్క్, నివసిస్తున్న ఇల్లు నమూనాను కూడా ఫొ టోలో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అసలే ఇల్లు లేని నిరుపేదలు వేరే ఇల్లు అద్దెకు ఉంటే కొందరు అధికారులు అద్దె ఇంట్లో ఫొటో తీసి అప్‌లోడ్ చేశా రు. దీంతో యాప్ అదే లబ్ధిదారుడి ఇల్లుగా నమో దు చేసి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుకు అనర్హులు గా నిర్ధారించినట్లు కొందరు అధికారులు చెబుతున్నారు. కొన్ని చోట్ల పక్కా ఇల్లు, భూములు ఉన్నా అర్హుల జాబితాలో పేర్లు రావడం గమనార్హం.
కొంపముంచిన డిజిటల్ యాప్
తప్పుల తడకగా పథకాల సర్వే
అనర్హులకు అందలం..
అర్హులకు మొండి చెయ్యి
అన్ని అర్హతలు ఉన్నా..
మా పేరెందుకు లేదని నిలదీత
మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచన
రీ సర్వేపై ఎటూ తేల్చని అధికారులు
జిల్లాలోని గ్రామ పంచాయతీలు: 487
నాలుగు మున్సిపాలిటీల్లో
మొత్తం వార్డులు: 82
మొత్తం జరిగిన గ్రామసభలు: 569
కొత్తగా వచ్చిన దరఖాస్తులు
రేషన్ కార్డులు 37,954
ఇందిరమ్మ ఇల్లు 30,611
రైతు భరోసా 561
ఇందిరమ్మ
ఆత్మీయ భరోసా 17,111
మొత్తం 86,237
Comments
Please login to add a commentAdd a comment