బడుగుల నేతకు జాతీయస్థాయి గుర్తింపు
హన్మకొండ: సామాజిక ఉద్యమకారుడు, బడుగుల నాయకుడు మంద కృష్ణ మాదిగకు జాతీయస్థాయి గుర్తింపు వచ్చింది. ప్రజా వ్యవహారాల్లో విశిష్ట సేవలు అందించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం శనివారం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. ఎస్సీల్లో మాదిగలకు జరుగుతున్న అన్యాయం, కోల్పోతున్న అవకాశాలపై మంద కృష్ణ మాదిగ గత 30 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణతోపాటు, సామాజిక సమస్యలపై పోరాటం చేశారు. హనుమకొండ హంటర్ రోడ్‌లోని న్యూశాయంపేటకు చెందిన మంద చిన్న కొమురయ్య, కొమురమ్మలకు పదవ సంతానంగా మంద కృష్ణ మాదిగ 1965, జులై 7న జన్మించారు. ఆయన భార్య మంద జ్యోతి, సంతానం కిషన్, డాక్టర్ కృష్ణవేణి, కార్తీక్ ఉన్నారు.
1994లో ఉద్యమం మొదలు..
1994, జూలై 7న మంద కృష్ణ మాదిగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఈదురుమూడి గ్రామంనుంచి 14 మంది యువకులతో మాదిగ దండోరా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఎస్సీ కులాలకు జనాభా నిష్పత్తి ప్రకారం అవకాశాలు అందాలని, మాదిగలకు న్యాయం జరగాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. అనతి కాలంలోని బలమైన ఉద్యమ సంస్థగా ఎమ్మార్పీఎస్ ఎదిగింది. అణగారిన వర్గాల గొంతుకగా నిలిచింది. ఒకవైపు దండోరా ఉద్యమాన్ని కొనసాగిస్తూనే మరో వైపు వికలాంగులకు పెన్షన్, ఇతర హక్కుల సాధనకు, గుండె జబ్బుల వ్యాధులతో బాధపడుతున్న చిన్న పిల్లలు, వృద్ధులు, వితంతువుల పక్షాన పోరాటం చేశారు.
వర్గీకరణ విజయం..
ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ ద్వారా 30 ఏళ్లుగా చేసిన ఉద్యమం ఇటీవల విజయం సాధించింది. విద్య ఉద్యోగ రిజర్వేషన్లలో ఎస్సీ ఉప వర్గీకరణకు అనుకూలంగా గత ఏడాది ఆగస్టు1న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మంద కృష్ణ మాదిగ చివరి వరకు ఎస్సీ వర్గీకరణ సాధనే లక్ష్యంగా, సామాజిక సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశారు. కాగా, మంద కృష్ణకు పద్మశ్రీ రావడం పట్ల పలువురు ప్రజా సంఘాల నాయకులు, ఉమ్మడి జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
సామాజిక ఉద్యమకారుడు మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ
ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
ప్రజా సంఘాల నాయకులు,
ప్రజల హర్షం
Comments
Please login to add a commentAdd a comment