![మళ్లీ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/38321916_8605351_mr-1739413978-0.jpg.webp?itok=u6tmfe1E)
మళ్లీ కోతలు..!
ఉమ్మడి జిల్లాలో ప్రసవాల తీరు (2024 జనవరి 1 నుంచి 2025 జనవరి 31 వరకు)
మొత్తం ప్రసవాలు : 40,221
సాధారణం : 13,036
ఆపరేషన్ : 27,185
ప్రభుత్వ ఆస్పత్రుల్లో..
సాధారణ : 10,569
ఆపరేషన్ : 14,645
ప్రైవేట్ ఆస్పత్రుల్లో..
సాధారణ : 2,467
ఆపరేషన్ : 12,540
సాక్షిప్రతినిధి, వరంగల్ :
● హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్‌కు చెందిన ఓ మహిళ ప్రసవం కోసం హనుమకొండ నయీంనగర్ ప్రాంతంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. నెలనెల అదే ఆస్పత్రిలోనే చెక్ చేయించుకుంటున్నప్పటికీ జనవరి 29 డెలివరీ టైం ఇచ్చి 23న జాయిన్ చేసుకున్నారు. ‘కడుపులో పిండం అడ్డం తిరిగింది.. సాధారణ ప్రసవం కష్టమే’నన్న డాక్టర్ సూచనతో ఆపరేషన్‌కు అంగీకరించడం అనివార్యంగా మారింది.
● వరంగల్ జిల్లా సంగెం మండలానికి చెందిన ఓ మహిళ (28)ను రెండో కాన్పు కోసం హనుమకొండ కాకాజీ కాలనీలోని ఆస్పత్రికి ఆమె కుటుంబసభ్యులు తీసుకు వెళ్లారు. ఆమెకు సాధారణ కానుపు కష్టమని డాక్టర్ సూచించగా.. మొదటి కాన్పు ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణమేనని చెప్పినా ఆమెకు సిజేరియన్ ద్వారా ప్రసవం చేసినట్లు చెప్పారు.
... ఇలా ఉమ్మడి వరంగల్‌లో కడుపు కోతలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో నిర్వహించే ప్రతీ 100 డెలివరీల్లో 68 సిజేరియన్లే ఉంటున్నాయి. 32 శాతమే సాధారణ ప్రసవాలు కాగా.. ఆపరేషన్ ప్రసవాలు మొత్తంగా చూస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఎక్కువగా అయ్యాయి.
67.59 శాతం అపరేషన్ ప్రసవాలే...
ఉమ్మడి వరంగల్‌లో 2024 జనవరి 1 నుంచి 2025 జనవరి 31 వరకు.. మొత్తం ప్రసవాలు 40,221 జరిగాయి. అందులో 13,036 సాధారణ ప్రసవాలు కాగా.. 27,185 మందికి ఆపరేషన్‌లు చేసి పురుడు పోశారు.
● హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ఏడాదిలో జరిగిన ప్రసవాల గణాంకాలను పరిశీలిస్తే ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి వరంగల్ గణాంకాలు చూస్తే.. ఈ రెండు జిల్లాల్లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో అత్యధికంగా ఆపరేషన్ ప్రసవాలు జరగడమే ఇందుకు నిదర్శనం. జిల్లాలో మొత్తం ప్రసవాలు 11,369 జరిగితే, అందులో 2,942 (25.88 శాతం) మాత్రమే సాధారణ ప్రసవాలు కాగా, 8,427 ( 74.12) ప్రసవాలు ఆపరేషన్ ద్వారా చేశారు. 8,427లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 3,926 జరిగితే, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 4.511 ప్రసవాలు ఆపరేషన్ చేశారు. అదే విధంగా వరంగల్ జిల్లాలో మొత్తం 8,343 ప్రసవాల్లో 2,301 (27.58 శాతం) సాధారణం కాగా, 6,042 (72.42 శాతం) ఆపరేషన్ ప్రసవాలు చేశారు. 6,042 ఆపరేషన్ ప్రసవాల్లో 2,929 ప్రభుత్వాస్పత్రుల్లో జరిగితే, 3,123 ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేశారు.
మహబూబాబాద్‌లో మరీ దారుణం....
● మహబూబాబాద్ జిల్లాలో ఏడాదిలో 7,174 ప్రసవాలు జరిగితే.. అందులో 1,885 (26.27 శాతం) సాధారణ ప్రసవాలు కాగా, 5,289 (73.73 శాతం) కడుపు కోసి కాన్పు చేసినవే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగిన 4,031 ప్రసవాల్లో 1,557 సాధారణం కాగా, 2,474 సిజేరియన్‌లు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 3,153 ప్రసవాలకు 328 సాధారణం కాగా, 2,815 సి సెక్షన్ ద్వారా ప్రసవాలు జరిగాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 4,539 ప్రసవాలకు 2,184 సాధారణం కాగా, 2,355 సిజేరియన్ చేశారు. అలాగే ములుగు జిల్లాలో 3,974 ప్రసవాలకు 1,772 సాధారణం, 2,202 ఆపరేషన్ ప్రసవాలు. అయితే ఇక్కడ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగాయి. 3,057లో 1,461 ఆపరేషన్‌లు కాగా, 1,596 సాధారణ ప్రసవాలు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 917లకు 741 ఆపరేషన్‌లు కాగా, 176 సాధారణ ప్రసవాలుగా నమోదయ్యాయి.
ప్రభుత్వాసుపత్రుల వైపే ‘జనగామ’...
● జనగామ జిల్లాలో ఏడాదిలో 4,822 ప్రసవాలు జరిగితే.. అత్యధికంగా 4,412 మంది ప్రభుత్వాస్పత్రుల్లోనే పురుడు పోసుకున్నారు. మొత్తం 4,822 ప్రసవాల్లో 1,952 సాధారణం కాగా, 2,870 మందికి ఆపరేషన్ చేశారు. ప్రభుత్వాసుపత్రిలో పురుడు పోసుకున్న 4,412 మందిలో 1,862 ప్రసవాలు సాధారణం కాగా, 2,650 సిజేరియన్. అలాగే 310 మంది ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవించగా, 90 మంది సాధారణం కాగా, 310 మందికి ఆపరేషన్లు అనివార్యంగా మారాయి.
సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యం..
ఆ దిశగా ప్రయత్నాలు..
ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో సాధారణ డెలివరీలు చేసేందుకు ప్రాధాన్యమిస్తున్నాం. సాధారణ ప్రసవాలు పెంచే విధంగా ప్రతీనెల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రి డాక్టర్లతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నాం. తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్ ద్వారా కాన్పులు చేయాలని, అందుకు గల కారణాలను రికార్డుల్లో నమోదు చేయాలని, ఎప్పటికప్పుడు సంబంధిత వివరాలను తెప్పించుకుంటున్నాం. ఆశాలు, ఏఎన్‌ఎంల ద్వారా గర్భిణులకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ ఆస్పత్రిలోనే డెలివరీలు చేసుకునే విధంగా అవగాహన పెంపొందిస్తున్నాం.
– డాక్టర్ మధుసూదన్,
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, భూపాలపల్లి
ఉమ్మడి వరంగల్‌లో మళ్లీ పెరిగిన ‘సిజేరియన్’లు
ఆస్పత్రి ప్రసవమంటే
ఆపరేషన్ తప్పనిసరి
67.59 శాతం ఆపరేషన్లే..
32.41 శాతమే సాధారణం
ప్రైవేట్ ఆస్పత్రుల్లో 46.13శాతం
కోతలు.. సర్కారు దవాఖానాల్లో
53.87 శాతం..
హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో
మరీ దారుణం
మిగతా నాలుగు జిల్లాల్లోనూ
ఇదే పరిస్థితి..
![మళ్లీ కోతలు..!1](https://www.sakshi.com/gallery_images/2025/02/13/01_mr-1739413978-1.jpg)
మళ్లీ కోతలు..!
Comments
Please login to add a commentAdd a comment