![అప్‌గ్రేడ్ ఆలస్యం!](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/12mbd705-603343_mr-1739413978-0.jpg.webp?itok=G_FqVKW7)
అప్‌గ్రేడ్ ఆలస్యం!
సాక్షి, మహబూబాబాద్: పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో గత సర్కారు ప్రభుత్వ ఆస్పత్రుల అప్‌గ్రేడ్, నూతన ఆస్పత్రుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. అయితే 16 నెలలు గడిచినా పనులు ముందుకు సాగడం లేదు. టెండర్లు పూర్తి చేసి కొన్ని పనులు ప్రారంభించగా.. మరికొన్ని స్థల సేకరణ ప్రక్రియతోనే నిలిచిపోయాయి. దీంతో ఆస్పత్రుల నిర్మాణాల కోసం వేసి న శిలాఫలకాలు వెక్కిరిస్తుండగా.. పేదలకు జబ్బు చేస్తే మెరుగైన వైద్యం అందని పరిస్థితి నెలకొంది.
వెక్కిరింత..
జిల్లాలో మానుకోట తర్వాత తొర్రూరు పట్టణం పెద్దది. మరిపెడ గిరిజనులు అధికంగా ఉన్న పట్టణం. ఆయా పట్టణాల్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు ప్రతీరోజు వందలాది మంది రోగులు వస్తుంటారు. స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వం ఈ రెండు ఆస్పత్రులను 100 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేసింది. ఒక్కో ఆస్పత్రి నిర్మాణానికి రూ.36కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 2023 సెప్టెంబర్ 28న అప్పటి వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చేతుల మీదుగా ఆస్పత్రుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా జిల్లాలోని నర్సింహులపేట, పెద్దవంగర, సీరోలు మండలాల్లో నూతన ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు మంజూరు చేశారు. ఇందుకోసం ఒక్కో పీహెచ్‌సీకి రూ.1.43కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో సీరోలు మండలం కాంపెల్లి, నర్సింహులపేట మండలంలో పీహెచ్‌సీ నిర్మాణాల కోసం టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. కానీ పనులు ప్రారంభం కాలేదు. అదేవిధంగా పెద్దవంగర పీహెచ్‌సీ కోసం భూసేకరణ జరగలేదు. అదేవిధంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది సెస్టెంబర్‌లో కేసముద్రం మున్సిపాలిటీ, కొత్తగూడ మండల కేంద్రంలో ఉన్న ఆస్పత్రులను 30 పడకలకు అప్‌గ్రేడ్ చేసింది. కొత్తగూడ ఆస్పత్రికి రూ.13.5కోట్లు, కేసముద్రానికి రూ. 12కోట్లు మంజూరు చేశారు. అయితే ఈ పనులు టెండర్ దశలోనే ఉన్నాయి.
శంకుస్థాపనకే పరిమితమైన సీహెచ్‌సీలు
ఏడాదిగా వెక్కిరిస్తున్న శిలాఫలకాలు
టెండర్ పూర్తయినా
ప్రారంభంకాని పనులు
పెద్ద ఆస్పత్రికోసం పేదల ఎదురుచూపు
పూర్తి చేస్తే దగ్గరకానున్న వైద్యం
జిల్లాలో అధికంగా గిరిజనులు, ఆదివాసీలు ఉన్నారు. వారు వైద్యానికి దూర ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో వారి సంపాదనలో ఎక్కువ శాతం వైద్యం కోసమే ఖర్చు చేస్తున్నారు. కొందరు అప్పుల పాలు కూడా అవుతున్నారు. తొర్రూరు, మరిపెడ ఆస్పతుల నిర్మాణాలను పూర్తి చేస్తే వేలాది మందికి మెరుగైన వైద్యం అందుతుంది. తొర్రూరు, మరిపెడ సీహెచ్‌సీల్లో జనరల్ ఫిజీషియన్లు, జనరల్ సర్జన్లు, ప్రత్యేక నిపుణులు, స్టాఫ్ నర్సులు, పేషెంట్ కేర్స్, శానిటేషన్ సిబ్బంది వస్తారు. దాదాపు ఒక్కో ఆస్పత్రికి 120 మంది మేరకు వైద్యులు, సిబ్బంది వస్తారు. 24 గంటల ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉంటుంది. చుట్టు పక్కల మండలాలతో పాటు పక్కన ఉన్న జిల్లాల ప్రజలకు మేలు జరుగుతుంది. అలాగే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వం జనరల్ ఆస్పత్రితో పాటు గూడూరు, గార్ల సీహెచ్‌సీలు, 21 పీహెచ్‌సీల వైద్యం మెరుగుపర్చాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment