మిరపలో సస్యరక్షణ అవసరం
అలంపూర్: మిరపలో సస్యరక్షణ చర్యలు అవసరమని వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియనాయక్ సూచించారు. ప్రస్తుతం మిరప పూతదశలో ఉండటంతో వివిధరకాల చీడపీడలు ఆశించి పంటను నష్టపరుస్తున్నాయి. ఈఏడాది జిల్లాలో మిరప విస్తారంగా సాగులో ఉంది. మిరపలో ఆశిస్తున్న చీడలు, పురుగులు, వాటి నివారణను జిల్లా ఇంచార్జీ వ్యవసాయ శాఖాధికారి సక్రియనాయక్ వివరించారు.
ఆకు ముడత..
తామర పురుగుతో ఆకు ముడత వ్యాపిస్తోంది. తామర పురుగులు ఆకు నుంచి రసం పీల్చడంతో ఆకులు పైకి ముడుచుకుపోతాయి. చివరకు ఇవి బోటు ఆకారంలోకి మారిపోతాయి. దీంతో కిరణజన్య సంయోగక క్రియ దెబ్బతిని దిగుబడి తగ్గిపోతుంది.
నివారణ..
ముందుగా లేత ఆకులు వస్తున్నప్పుడు వేప నూనె 5 మి.లీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తర్వాత డైఫెంధురాన్ 1గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి
కాయ తొలుచు పురుగు..
కాయ తొలుచు పురుగు లద్దెపురుగులు మిరప కాయలపై చిన్న రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశించి లేత గింజలను తింటాయి. దీంతో నాణ్యత తగ్గిపోతుంది.
నివారణ..
ఈ పురుగు నివారణకు క్లోరాంత్రినిప్రోల్ 0.3మి.లీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. వరి తౌడు 10 కిలోలు, బెల్ల పాకం 2కిలోలు, థయోడికార్బ్ 500 గ్రాములు కలపుకొని చిన్నచిన్న ఉండలుగా చేసి పొలంలో సాయంత్రం వేళల్లో చల్లితే ఈ పురుగును సమర్థవంతంగా ఆరికట్టవచ్చు.
ఆకు మచ్చ తెగులు..
ఆకులపై చిన్నచిన్న మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు కలిసిపోయి ఆకులు రాలిపోతాయి.
నివారణ
ఈ తెగులు నివారణకు సాఫ్ 2గ్రాములు లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి.
కాయ కుళ్లు తెగులు..
ఈ తెగులు శీలింధ్రం ఆశించడంతో వస్తోంది. ఈ తెగులు మొదట చిన్నటి నల్లమచ్చలుగా కాయలపై వస్తోంది. కాయ మొత్తం నల్లగా మారి కుళ్లిపోతుంది.
నివారణ..
ఈ కాయ కుళ్లు తెగులు నివారణకు డైఫెనకొనజోల్ 1 మి.లీ లీటర్ నీటికి కలిపి పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి.
పాడి–పంట
జింక్ లోపం..
జింక్ ధాతువు లోపంతో ఆకుల మధ్య ఈనెలు పసుపు పచ్చ రంగులోకి మారుతాయి. కిరణజన్య సంయోగ క్రియ దెబ్బతింటుంది. జింక్ ధాతువు లోపం ఎక్కువైతే ఆకులన్నీ రాలిపోతాయి.
నివారణ..
ఈ ధాతువు లోపం నివారణకు జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment