కోస్గి: పొక్సో కేసులో బుధవారంజిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారగార శిక్ష, రూ.50వేలు జరిమానా విధించారు. అలాగే బాధితురాలికి రూ.5లక్షల పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చారు. జిల్లా ఎస్పీ యోగేష్ గౌతం తెలిపిన వివరాల మేరకు.. కోస్గి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓగ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న 14ఏళ్ల మైనర్ బాలికను మహబూబ్‌నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ తరుణ్‌కుమార్ ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పాడు. తన అమ్మమ్మ ఊరు, బాలిక ఊరు ఒకటే కావడంతో తరచు గ్రామానికి వచ్చి ప్రేమ పేరుతో బాలికకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. ఈవిషయం గమనించిన బాలిక కుటుంబ సభ్యులు తరుణ్‌ను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఈ క్రమంలో గతేడాది మే30న అర్ధరాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటిపై నిద్రిస్తున్న బాలికను పెళ్లి పేరు చెప్పి ఆటోలో ఎక్కించుకుపోయాడు. హైదరాబాద్‌లో ఒక రూంలో బంధించి బాలికను బెదిరిస్తూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన కూతురును నమ్మించి మోసం చేసిన యువకుడిపై బాధితురాలి తల్లి అప్పట్లో ఫిర్యాదు చేసింది. మే31న ఎస్సై శ్రీనివాసులు పొక్సో కేసు నమోదు చేశారు. సీఐ జనార్దన్ సమగ్ర విచారణ జరిపి పూర్తి వివరాలతో కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసు పూర్వపరాలను పీపీ ఆకుల బాలప్ప కోర్టుకు వివరిస్తూ తన వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో జిల్లా ఫాస్ట్‌ట్రాక్ ఫోక్సో కోర్టు ఇంచార్జీగా ఉన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ నిందితుడికి కఠిన కారగార శిక్ష, రూ.50వేలు జరిమానా విధించారు. బాధితురాలికి రూ.5లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చినట్లు తెలిపారు. నిందితుడికి శిక్ష పడటంలో బాధ్యతాయుతంగా పనిచేసిన పోలీసు అధికారులు, సిబ్బందితోపాటు పీపీలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. త్వరలోనే రివార్డులు ఇస్తామని ప్రకటించారు.
రూ.50వేలు జరిమానా
బాధితురాలికి రూ.5లక్షల పరిహారం
Comments
Please login to add a commentAdd a comment