కుటుంబ కలహాలతో వ్యక్తి బలవనర్మణం
నాగర్‌కర్నూల్ క్రైం: కుటుంబ కలహాలతో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకోగా బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై గోవర్దన్ తెలిపిన వివరాల మేరకు.. మున్సిపాల్టీ పరిధిలోని ఉయ్యలవాడ గ్రామానికి చెందిన మొగిళ్ల బొబ్బిలి(36) వ్యవసాయం చేసి జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో గొడవపడి మనస్తాపానికి గురయ్యాడు. క్షణికావేశంలో ఇంట్లో నుంచి వెళ్లి పొలంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. ఆత్మహత్యకు పాల్పడే ముందు పాలెంలో తన అక్కకు ఫోన్‌చేసి చనిపోతున్నానని చెప్పాడు. ఆమె కుటుంబసభ్యులకు విషయం చెప్పడంతో పొలం వద్దకు వెళ్లి చూడగా మొగిళ్ల బొబ్బిలి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి అన్న లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
నిప్పంటించుకొని
వృద్ధుడు..
కల్వకుర్తిరూరల్: స్థానిక ఇందిరానగర్‌కాలనీకి చెందిన చిత్తారి చంద్రయ్య(60) అనే వృద్ధుడు ఒంటిపై డీజిల్ పోసుకొని బుధవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ మాధవరెడ్డి తెలిపారు. ఆరు నెలల క్రితం మృతుడి భార్య అనారోగ్యంతో మరణించింది. అప్పటి నుంచి చంద్రయ్య ఒంటరిగా ఉంటున్నాడు. భార్య మరణాన్ని జీర్ణించుకోలేక మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈఘాతుకానికి పాల్పడగా కుటుంబ సభ్యులు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి అన్న కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
గుండెపోటుతో
ఇద్దరి మృతి
అయిజ: గుండెపోటుతో ఒకే రోజు ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన సంఘటన మండలంలోని ఉత్తనూరులో, అయిజ మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. మృతుల బంధువులు తెలిపిన వివరాలు... అయిజ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు జహీర్ (55) మంగళవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. మృతుడికి భార్య, కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మండలంలోని ఉత్తనూరు గ్రామానికి చెందిన అనంతమ్మ(60) మంగళవారం రాత్రి ఆమె నివాసంలో గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచింది. ఈ సంఘటనలతో ఆయా కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.
రేషన్ బియ్యం పట్టివేత
లింగాల: అక్రమంగా తరలిస్తున్న మూడు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. బుధవారం మండలంలోని అంబట్‌పల్లి వైపు నుంచి ఆటోలో బియ్యాన్ని లింగాలకు తీసుకొస్తుండగా గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు పట్టుబడ్డాడు. పట్టుబడిన బియ్యాన్ని సంబంధిత అధికారులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment