ఇందిరా మహిళా శక్తి లక్ష్యాలను చేరుకోవాలి
నాగర్‌కర్నూల్/ తెలకపల్లి/ పెద్దకొత్తపల్లి: ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకం లక్ష్యాన్ని చేరుకోవాలని గ్రామీణాభివృద్ధి సంస్థ, శ్రీనిధి, డీపీఎంలు, ఏటీఎంలు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లను కలెక్టర్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరా మహిళా శక్తి పథకం అమలు తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులను చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని.. ఈ మేరకు వ్యక్తిగత, గ్రూప్‌ల వారీగా మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలన్నారు. ప్రతినెలా టార్గెట్ నిర్ణయించి, ముందుకు వెళ్లాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌డీఓ చిన్న ఓబులేసు, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్, శ్రీనిధి అదనపు పీడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలో పరిశీలన..
తెలకపల్లితోపాటు వట్టిపల్లి, నాగర్‌కర్నూల్ మండలంలోని పెద్దముద్దునూర్, పెద్దకొత్తపల్లి మండలంలోని సాతాపూర్ గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా వట్టిపల్లిలో ఇందిరా మహిళా శక్తి పథకం, శ్రీనిధి, బ్యాంక్ లింకేజీ రుణాలతో ఏర్పాటు చేసిన యూనిట్లను పరిశీలించారు. పెద్దముద్దునూర్‌లో శ్రీరామమిల్క్ పార్లర్, హార్డ్‌వేర్, ఫొటోస్టూడియో దుకాణాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. సాతాపూర్, వట్టిపల్లిలో కోడిపిల్లల పెంపక కేంద్రం, తెలకపల్లిలో లేడీస్ టైలర్, డ్రైక్లీనింగ్ రోలింగ్ సెంటర్, మానస కమ్యూనికేషన్, హనుమాన్ ఫ్లెక్సీ సెంటర్ల పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా జిల్లాలో పెరటి కోళ్ల పెంపకాన్ని విస్తృతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. అలాగే 12 రకాల వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు మహిళలకు అవసరమైన సంపూర్ణ సహకారం అందిస్తున్నామని, ఇందులో మీ సేవా, ఆహార శుద్ధి కేంద్రాలు, పౌల్ట్రీ తదితర యూనిట్లు అందుబాటులో ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీనిధి ఏపీడీ లక్ష్మీనారాయణ, డీపీఎం అరుణాదేవి, వెంకటేష్, ఏపీఎం నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.
స్వయం సహాయక సంఘాల సభ్యులు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి
నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్
Comments
Please login to add a commentAdd a comment