మిఠాయి దుకాణంలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్
గద్వాల క్రైం: అనుమతి లేకుండా మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ మిఠాయి దుకాణంలోకి దూసుకెళ్లగా నిద్రిస్తున్న భార్యభర్తలను ఢీకొట్టగా మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన గద్వాల పట్టణంలో మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. బీసీ కాలనీకి చెందిన సరోజమ్మ, దౌలన్నలు గద్వాల చిన్న జాతర సందర్భంగా భీం నగర్ రోడ్డు మార్గంలో మిఠాయి అంగడి ఏర్పాటు చేశారు. అయితే నది ఆగ్రహారానికి చెందిన మట్టి వ్యాపారి అర్ధరాత్రి నుంచి అనుమతి లేకుండా వజ్రాల గుట్ట నుంచి జేసీబీ సహాయంతో మట్టిని ట్రాక్టర్ల ద్వారా గద్వాల వైపు తరలిస్తున్నారు. ఈ క్రమంలో తెల్లవారు జామున మట్టితో ట్రాక్టర్‌ను మైనర్ యువకుడు భీం నగర్ మీదుగా తీసుకొస్తున్నాడు. ట్రాక్టర్ డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడంతో మిఠాయి అంగడిలోకి ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఈ క్రమంలో అంగడిలో నిద్రిస్తున్న భార్యభర్తలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సరోజమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ట్రాక్టర్ నడిపిన మైనర్ యువకుడిని, ట్రాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నదిగ్రహారానికి చెందిన మట్టి వ్యాపారి ప్రభుత్వ భూముల నుంచి జేసీబీ సహాయంతో ఐదు ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ట్రాక్టర్లు మైనర్లు నడుపుతున్నారని బాధిత కుటుంబ సభ్యులు వివరించారు. సదరు మట్టి వ్యాపారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
మహిళ పరిస్థితి విషమం
ట్రాక్టర్ డ్రైవర్ మైనర్‌గా గుర్తింపు
Comments
Please login to add a commentAdd a comment