నదిలో రయ్..రయ్
బోటు షికారు
మరింత చేరువ
● సోమశిలలో కొత్తగా ఐదు వాటర్ బోట్లు ఏర్పాటు
● ఇద్దరు నుంచి నలుగురు కృష్ణానదిలో విహరించేందుకు అవకాశం
● త్వరలోనే మంత్రి జూపల్లి కృష్ణారావు చేతులమీదుగా ప్రారంభం
పర్యాటకుల సంఖ్య పెంచేలా..
కృష్ణానది అందాలు తిలకించేందుకు పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. కొంతమంది నదిలో స్పోర్ట్స్ బోట్లు ఏర్పాటుచేస్తే బాగుంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకువచ్చారు. మంత్రి సూచన మేరకు స్పోర్ట్స్ బోట్ల ఏర్పాటుకు టూరిజం శాఖ చర్యలు చేపట్టింది. సోమశిల, అమరగిరి, సింగోటం, మల్లేశ్వరం, మంచాలకట్ట ప్రాంతాలకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెంచేందుకు, వారికి అవసరమైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– నర్సింహ్మ, జిల్లా పర్యాటకశాఖ అధికారి
కొల్లాపూర్: నదీ ప్రయాణాలు కోరుకునే పర్యాటకులకు ఇది ఉత్సాహం కలిగించే అంశం. సోమశిల వద్ద కృష్ణానదిలో పర్యాటకులు ఒంటరిగా లేదా జంటగా విహరించేందుకు టూరిజం శాఖ కొత్త వాటర్ బోట్లు (స్పోర్ట్స్ బోట్లు) ఏర్పాటు చేసింది. ప్రైవేటు సంస్థకు బోట్ల నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. ఇప్పటికే బోటు షికారు ప్రారంభం కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. త్వరలోనే రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొత్త బోట్లను ప్రారంభించనున్నారు.
పర్యాటకుల షికారు కోసం..
సోమశిల వద్ద కృష్ణానది అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఇక్కడ పర్యాటక శాఖ ఇప్పటికే సోమేశ్వర లాంచీ (మినీ)ని ఏర్పాటుచేసింది. ఇందులో 30 మందికి పైగా ప్రయాణికులు నదిలో విహరించేందుకు వీలుంది. రోజు సోమశిల నుంచి మల్లేశ్వరం ఐలాండ్ వరకు పర్యాటకులను తీసుకువెళ్లి.. వెనక్కి తీసుకువస్తారు. సోమశిల నుంచి శ్రీశైలం వెళ్లేందుకు మరో పెద్ద లాంచీ కూడా అందుబాటులో ఉంది. అయితే ఎక్కువ సంఖ్యలో జనం ఉంటేనే ఈ రెండు బోట్లు నదిలోకి వెళ్తాయి. ఒకరిద్దరు ఉంటే వెళ్లవు. ఈ సమస్యకు పరిష్కారం తోపాటు ఔత్సాహికులకు నదీ షికారును మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో టూరిజం శాఖ చిన్నబోట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
ఒకరు లేదా ఇద్దరి నుంచి నలుగురు వరకు ప్రయాణించేలా 5 రకాల కొత్త బోట్లను ఏర్పాటుచేశారు. ఇద్దరు వ్యక్తులు వెళ్లేందుకు వీలుగా స్వాన్, కయాక్, స్కూటీ బోట్లు ఉన్నాయి. నలుగురు వెళ్లేందుకు వీలుగా ఫన్‌యాక్, పెడల్ బోట్లను సోమశిలలో సిద్ధంగా ఉంచారు. ఈ బోట్లను ప్రయాణికులే నడపవచ్చు. లేదంటే ప్రైవేటు సంస్థ ప్రతినిధి సహకారం తీసుకోవచ్చు. ఈ బోట్ల ద్వారా కృష్ణానదిలో విహరించేందుకు ఒక్కో ప్రయాణికుడికి రూ. 200 చొప్పున చార్జీలు వసూలు చేయాలని భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా స్పష్టమైన ప్రకటన రాలేదు. 15 నిమిషాల షికారుకు ధరను నిర్ణయించనున్నారు. ఎక్కువ సేపు నదిలో విహరిస్తే అదనపు చార్జీలు వసూలు చేయనున్నారు. డిమాండ్ పెరిగితే బోట్ల సంఖ్య పెంచే అవకాశం ఉందని నిర్వహణ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
పెరిగిన రద్దీ..
ఐదు రకాల కొత్త బోట్లు..
సోమశిలలో బోటు షికారుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు. సోమేశ్వర లాంచీకి రోజూ ఫుల్ గిరాకీ ఉంటోంది. అదే విధంగా శని, ఆదివారాల్లో మాత్రమే తిరిగే సోమశిల టూ శ్రీశైలం లాంచీ ప్రయాణానికి కూడా ఇటీవల డిమాండ్ పెరిగింది. ప్రతి వారం వంద మంది మేరకు లాంచీలో ప్రయాణాలు సాగిస్తున్నారు. 8 వారాలుగా రెగ్యులర్‌గా లాంచీ ప్రయాణం సాగుతోంది. లాంచీ ప్రయాణాలకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో కొత్తగా ఏర్పాటుచేస్తున్న స్పోర్ట్స్ బోట్లకు కూడా డిమాండ్ ఉంటుందని పర్యాటక శాఖ అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment