మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు
పాలమూరు: రోడ్లపై వాహనాలు నడిపే ప్రతి వాహనదారుడు తప్పక నిబంధనలు పాటించాలని, ప్రధానంగా హెల్మెట్, సీటు బెల్ట్ తప్పక ధరించాలని ఆర్టీఓ రఘుకుమార్ అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్ ఆవరణలో ఆటో డ్రైవర్లకు నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ వాహనాలకు సంబంధించిన ఫిట్‌నెస్ నిత్యం చెక్ చేసుకోవాలని, ఆటోలలో సామర్థ్యం కంటే ఎక్కువ మంది ప్రయాణికులను తరలించరాదన్నారు. ప్రతిఒక్కరు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని, మద్యం తాగి ఎవరూ వాహనాలు నడపరాదన్నారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదని, ఏదైనా ప్రమాదాలు జరిగితే అందుకు వారే బాధ్యులవుతారని చెప్పారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రారంభం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) గురువారం జిల్లాకేంద్రంలోని ఫాతిమా విద్యాలయ, జేపీఎన్‌సీ కళాశాలలో ఆన్‌లైన్ విధానంలో ప్రారంభమైంది. ఈ మేరకు ఫాతిమా విద్యాలయంలో ఉదయం షిఫ్టులో 180 మందికి గాను 148 మంది హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం షిఫ్టులో 148 మందికి 163 మంది హాజరయ్యారు. జేపీఎన్‌సీలో ఉదయం షిఫ్టులో 180 మందికి 149 మంది, మధ్యాహ్నం షిఫ్టు లో 180 మందికి 147 మంది హాజరయ్యారు.
చిన్నరాజమూర్ హుండీ లెక్కింపు
దేవరకద్ర: మండలంలోని చిన్నరాజమూర్ ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ముగియడంతో గురువారం స్వామివారి హుండీని లెక్కించారు. జాతర సందర్భంగా భక్తులు స్వామివారికి సమర్పించిన నగదును లెక్కించగా రూ.7,67,044 ఆదాయం సమకూరింది. దీంతో వచ్చిన డబ్బులను దేవస్థానం పేరిట బ్యాంకులో డిపాజిట్ చేశారు. హుండీ లెక్కింపులో ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, ఈఓ కవిత, చైర్మన్ రాఘవేంద్ర చార్యులు, నాయకులు రాజశేఖర్, కథలప్ప, దేవస్థాన కమిటీ సభ్యులు, అర్చకులు, ఎస్‌బీఐ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment