షీటీమ్స్‌తో మహిళలకు భద్రత: ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో షీటీమ్స్‌తో మహిళలకు, బాలికలకు భద్రత భరోసా కలుగుతుందని, విద్యాసంస్థల దగ్గర, రద్దీ ఏరియాల్లో నిరంతరం షీటీం బృందాల నిఘా కొనసాగుతుందని ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. అమ్మాయిలు, విద్యార్థినిలు వేధింపులకు గురైతే వెంటనే డయల్ 100, లేదా జిల్లా షీటీం నంబర్ 87126 59365 ఫిర్యాదు చేస్తే సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిసెంబర్‌లో నాలుగు ఫిర్యాదులు వచ్చాయని, ముగ్గురికి కౌన్సెలింగ్ ఇచ్చామని, ఇద్దరిని రెండ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఒక ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. సిబ్బంది గత నెల రోజుల్లో 65 హాట్ స్పాట్ ఏరియాలను తనిఖీలు చేశారని పేర్కొన్నారు. షీటీం బృందాలు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో, కేజీబీలు, రెసిడెన్షియల్ స్కూలలో విద్యార్థులకు ర్యాగింగ్, వేధింపులు, పోక్సో, షీటీం పనితీరు, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ వంటి అంశాలపై అవగాహన కలిపిస్తున్నట్లు వివరించారు. జిల్లాలో ఉన్న మహిళలు, విద్యార్థులు షీటీం సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు.
చైనా మాంజా విక్రయిస్తే
కఠిన చర్యలు
జిల్లా పరిధిలో ప్రభుత్వం నిషేధిత చైనా మాంజాను విక్రయాలు చేసినా, వినియోగించినా చట్ట ప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ జానకి హెచ్చరించారు. జిల్లాలో చైనా మాంజా విక్రయాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని, చైనా మాంజాతో వచ్చే అనర్థాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. నైలాన్, సింథటిక్ ధారాలు పక్షులకు, పర్యావరణానికి, మనుషులకు హాని చేస్తాయని తెలిపారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో చైనా మాంజా పూర్తిగా నిషేధించారని, జిల్లాలో ఎక్కడైనా, మార్కెట్‌లలో, దుకాణాల్లో చైనా మాంజా విక్రయించినట్లు తెలిస్తే పోలీస్‌స్టేషన్లు లేదా డయల్ 100 లేదా 87126 59360 ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment