ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా పనిచేయాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా పనిచేస్తే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సులువుగా పూర్తి చేయవచ్చని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో మహబూబ్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధిపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ విజయేందిరతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పురోగతి, పూర్తి అయినవి, అలాట్‌మెంట్ జరిగినవి, ఇంకా అలాట్‌మెంట్ చేయాల్సినవి, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. 3,550 డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు కాగా.. 2,929 ఇళ్లు పూర్తయ్యాయని, మరో 410 ఇళ్లు వివిధ దశల్లో పురోగతి ఉండగా.. 211 ఇళ్లు ఇంకా మొదలు పెట్టలేదని పీడీ చెప్పారు. ఇందులో 2,667 ఇళ్లు అలాట్‌మెంట్ చేశామన్నారు. మదనపల్లితండా, అల్లీపూర్, చౌదర్‌పల్లి, ఓబులాయిపల్లి, కోడూర్, ఫతేపూర్, యారాన్‌పల్లి, మౌలాలిగుట్ట, ఏనుగొండలో పూర్తయ్యి కేటాయింపు కాని వాటిని లబ్ధిదారులకు ఇవ్వాలన్నారు. కొత్తగా నిర్మించిన ఇళ్లలో మౌలిక వసతుల కల్పనకు రూ.9.7 కోట్లు మంజూరు అయినట్లు వివరించారు. మిషన్ భగీరథ అధికారులు పరిశీలన చేసి వాటర్ కనెక్షన్ ఇవ్వాలని సూచించారు. వచ్చే వేసవిలో తాగునీటి సమస్య ఎదురు కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. హన్వాడ మండలం ఇబ్రహీంబాద్‌లో రూ.2.77 కోట్ల అంచనాతో పెద్దవాగుపై చెక్‌డ్యాం, రూ.2.68 కోట్ల అంచనాతో గుండ్యాల పెద్ద వాగుపై చెక్‌డ్యాం, రూ.3.35 కోట్ల అంచనాతో వేపూర్ చిన్న వాగుపై నిర్మించే చెక్‌డ్యాం పనులపై చర్చించారు. అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన సీసీ రోడ్ల ప్రగతి, వచ్చే ఏడాది చేపట్టే పనుల గురించి ఆరాతీశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్‌రావు, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, హౌజింగ్ పీడీ భాస్కర్, నీటి పారుదలశాఖ ఎస్‌ఈ చక్రధరం, ఆర్డీఓ నవీన్, పీఆర్‌ఈఈ నరేందర్‌రెడ్డి, మిషన్ భగీరథ ఈఈలు వెంకట్‌రెడ్డి, పుల్లారెడ్డి, అర్బన్ తహసీల్దార్ ఘన్సీరాంనాయక్, డీటీ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment