సహజ వనరుల దోపిడీని వ్యతిరేకించాలి
పాలమూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ ప్రాంతాల్లోని సహజ ఖనిజ నిక్షేపాలను వెలికితీసి విదేశీ సామ్రాజ్యవాదులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రొ. గడ్డం లక్ష్మణ్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ఆరోపించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని టీఎన్జీఓ భవనంలో జరిగిన తెలంగాణ ప్రజాఫ్రంట్ ఉమ్మడి జిల్లా మహాసభలకు వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. సహజ వనరుల దోపిడీకి వ్యతిరేకంగా సంఘటితంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. దోపిడీని అడ్డుకుంటున్న స్థానిక పీడిత ప్రజలపై పాలకవర్గాలు పోలీసులతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాలు ఈ విధానాలు మార్చుకోకపోతే ప్రజావెల్లువలో కొట్టుకుపోతారని హెచ్చరించారు. రాష్ట్రంలో ఏరికోరి తెచ్చుకున్న పాలకులు తెలంగాణ కోసం బలిదానం చేసిన త్యాగధనులను మరిచి తమ స్వలాభం కోసం, తమకు కావాల్సిన పెట్టుబడిదారుల కోసం పని చేస్తున్నారని విమర్శించారు. పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి జిల్లాలో గుట్టల విధ్వంసం జరుగుతోందన్నారు. ఈ విధ్వంసంతో స్థానికులు సహజ వనరులు కోల్పోతారని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు మన్యంకొండ, శ్రీదేవి, ఇన్నయ్య, శంకర ప్రభాకర్, అంబయ్య, భరత్, భూషణ్, వామన్‌కుమార్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ప్రజాఫ్రంట్ మహాసభల్లో వక్తలు
Comments
Please login to add a commentAdd a comment