రికార్డుల అప్‌డేట్ ముఖ్యం
మహబూబ్‌నగర్ క్రైం: డీఐజీ కార్యాలయంలో రికార్డులు ఎప్పుటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం చాలా ముఖ్యమని మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న జోగుళాంబ జోన్–7 డీఐజీ కార్యాలయాన్ని సోమవారం వార్షిక తనిఖీ చేశారు. కార్యాలయంలో రికార్డులు, కేసు ఫైల్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రికార్డుల నిర్వహణలో సరైన విధానాలు పాటించడం ద్వారా పారదర్శకత పెరుగుతోందన్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న ఐదు జిల్లా పోలీస్ శాఖలో 2024లో 16,833 కేసులు నమోదైనట్లు తెలిపారు. వీటిలో 3784 కేసులు ఇంకా విచారణలో ఉన్నాయన్నారు. ఈ ఏడాది మహబూబ్‌నగర్‌లో 5896, నాగర్‌కర్నూల్‌లో 3770, వనపర్తిలో 3538, గద్వాలలో 2419, నారాయణపేటలో 2210 నమోదైనట్లు ఐజీ వెల్లడించారు. ప్రధానంగా హత్యలు 84, హత్యాయత్నాలు 78, దొంగతనాలు 1608 జరిగినట్లు తెలిపారు. ఆస్తినష్టం రూ.11.10కోట్లు అయితే దీంట్లో రూ.3.42కోట్లు రికవరీ చేశామన్నారు. ఉమ్మడి జిల్లాలో దొంగతనాల్లో కోల్పోయిన సొమ్ము రికవరీలో 30.82శాతం అయ్యిందన్నారు. కిడ్నాప్‌లు 202, మహిళలపై అత్యాచారాలు 315, చీటింగ్ 779, రోడ్డు ప్రమాదాలు 1559 నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో పనిచేసే పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల పట్ల నిబద్ధత చూపాలని ఆదేశించారు. ముఖ్యమైన రికార్డులను డిజిటలైజేషన్ చేసి భద్రంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో డీఐజీ ఎల్.ఎస్ చౌహాన్, ఎస్పీ డి.జానకి పాల్గొన్నారు.
ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో 16,833 కేసులు నమోదు
రూ.11.10కోట్లు కాజేసిన దొంగలు
రూ.3.42కోట్లు రికవరీ
మల్టీజోన్– 2 ఐజీ సత్యనారాయణ
Comments
Please login to add a commentAdd a comment