ఇద్దరి ప్రాణాలు తీసిన అతివేగం
మహబూబ్‌నగర్ క్రైం: అతివేగం, అజాగ్రత్త ఇద్దరి ప్రాణాలను తీసింది. ఆగి ఉన్న డీసీఎంను బైక్ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు మెడికల్ విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్ వివరాల మేరకు.. నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన ఎన్.శశాంక్ (19), దేవరకొండ మండలం మల్లెపల్లికి చెందిన జ్ఞానేశ్వర్ (19) పాలమూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో బీఎస్సీ ఎలైయిడ్ సైన్స్ ఫస్ట్ ఇయర్‌లో చేరారు. వీరిద్దరు స్నేహితులు కావడంతో జిల్లా కేంద్రంలోని షాషాబ్‌గుట్టలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ట్యాబ్‌లెట్ తెచ్చుకోవడానికి న్యూటౌన్‌లో ఉన్న మెడికల్ దుకాణానికి బైక్‌పై వెళ్తూ.. ప్రధాన రహదారిపై నిలిచి ఉన్న డీసీఎంను ఢీకొట్టారు. ప్రమాదంలో వారిద్దరికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను మార్చురీకి తరలించారు. అయితే హైదరాబాద్ నుంచి డీసీఎంలో లోడ్‌తో మహబూబ్‌నగర్‌కు చేరుకున్న డ్రైవర్ వెంకటేష్‌కు నిద్ర రావడంతో రోడ్డుపైనే నిలిపి డీసీఎంలోనే నిద్రించాడు. డీసీఎంకు కనీసం పార్కింగ్ లైట్స్, రేడియం స్టిక్కర్స్ లేకపోవడంతో, గమనించని ఇద్దరు విద్యార్థులు బైక్‌పై వేగంగా వచ్చి వెనక నుంచి ఢీకొట్టారు. జరిగిన ప్రమాదాన్ని చూస్తే డీసీఎం డ్రైవర్‌తో పాటు యువకుల తప్పిదం కూడా ఉన్నట్లు స్పష్టమవుతుంది. అర్ధరాత్రి వేళ కావడం.. రోడ్డు నిర్మానుష్యంగా ఉండటంతో యువకులు బైక్‌పై అతివేగంగా వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇద్దరికి హెల్మెట్ లేకపోవడంతో తల పగిలి దుర్మరణం చెందారు. హెల్మెట్ ఉంటే కచ్చితంగా ప్రాణపాయం ఉండేది కాదని పోలీసులు చెబుతున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు డీసీఎం డ్రైవర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.
● పాలమూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో బీఎస్సీ ఎలైయిడ్ సైన్స్ విద్యార్థులకు గురువారం ఓరియేంటేషన్ క్లాస్ ఉంది. మృతిచెందిన యువకులు సైతం ఉదయం క్లాస్‌కు వెళ్లాల్సి ఉండగా.. రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువు ఒడిలోకి వెళ్లారు. మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల ఆత్మ శాంతి కోసం తరగతి గదిలో విద్యార్థులు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.
ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన బైక్
ఇద్దరు మెడికల్ విద్యార్థుల దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment