ముగిసిన చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు
జడ్చర్ల టౌన్: మండలంలోని గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. ఉదయం వేదపండితుల మంత్రోచ్ఛారణలు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో నిత్య హోమం జరిపించి మహా పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ధ్వజ అవరోహణం చేసి ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఉత్సవ విగ్రహం ఉంచి చక్రతీర్థ సేవ జరిపించారు. అలాగే ద్వాదశ ఆరాదనలు, పుష్పయాగం, నాగబలి, దేవత ఉద్వాసన, సప్తవర్ణ సేవలు నిర్వహించారు. ఉత్సవాలు ముగిసినప్పటికీ భక్తులు మాత్రం ఆలయానికి భారీగా తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం కావడానికి సహకరించిన అధికారులు, ఆలయ సిబ్బంది, గ్రామస్తులకు పాలకమండలి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
22న గంప జాతర..
గంపజాతరను ఈ నెల 22న నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఉత్సవాలు ముగిసిన తర్వాత వచ్చే రెండో శనివారం గంపజాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రెండేళ్లకు ఓసారి పడమర ప్రాంత భక్తులు గంపలు తలపై పెట్టుకొని కాలినడకన ఆలయానికి చేరుకుంటారు. సొంత గ్రామంలో ఎత్తుకున్న గంపను ఎక్కడ దించకుండా నేరుగా ఆలయానికి చేరుకుంటారు. గంపజాతర ఉన్న ఏడాదిలో ఉత్సవాలకు వచ్చే భక్తుల సంఖ్య స్వల్పంగా తగ్గుతుంది.
Comments
Please login to add a commentAdd a comment