![ప్రత్యేకమా.. పొడిగింపా?](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/10acpt01-210106_mr-1739301716-0.jpg.webp?itok=0WnIdw-4)
ప్రత్యేకమా.. పొడిగింపా?
14న ముగియనున్న ‘సహకార’ పాలకవర్గాల గడువు
● ఆరు నెలల వరకు ఎన్నికల నిర్వహణ అనుమానమే..
● పదవీకాలం పొడిగించాలని కోరుతున్న చైర్మన్లు
● ప్రత్యేకాధికారుల నియామకానికి
అధికారుల కసరత్తు
● ఉమ్మడి జిల్లాలో 87 సహకార సంఘాలు
అచ్చంపేట: రైతులకు క్షేత్రస్థాయిలో సాగుపరమైన సేవలందిస్తూ.. అండగా నిలుస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 14తో ముగియనుంది. అయితే వీటికి ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో ప్రత్యేకాధికారులను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో ఆ తర్వాతే వీటి ఎన్నికలు ఉంటాయని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే బ్యాంకు కార్యకలాపాలన్నీ ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉండటంతో ప్రత్యేకాధికారుల పాలనతో వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని, ప్రస్తుతం ఉన్న పాలకవర్గాలనే మరో ఆరు నెలలు పొడిగించాలని డీసీసీబీ నాయకుడొకరు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ సమయంలోనూ అప్పటి ప్రభుత్వం ఆరు నెలల చొప్పున నాలుగు సార్లు డీసీసీబీ పాలకవర్గాలకు కొనసాగించిందని గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం గడువు పొడిగిస్తుందా.. లేక ప్రత్యేకాధికారుల పాలనకే మొగ్గుచూపుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే సొసైటీల ప్రత్యేకాధికారుల నియమాకానికి ఉమ్మడి జిల్లాలోని సహకార శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఆరు నెలల ముందుగానే ప్రక్రియ
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 76 సొసైటీలు ఉన్నాయి. మహబూబ్‌నగర్ డీసీసీబీ పరిధిలోని ఐదు జిల్లాలు, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధులు కలుపుకొంటే మొత్తం 87 పీఏసీఎస్‌లు ఉన్నాయి. అయితే పీఏసీఎస్‌లకు అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2020 ఫ్రిబవరి 14న ఎన్నికలు నిర్వహించింది. సొసైటీ పరిధిలో ఎన్నికై న చైర్మన్లతో అదే నెల 25న డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. పలువురు డైరెక్టర్లను సైతం ఎన్నుకున్నారు. ఈ పాలకవర్గాల గడువు ఈ నెల 14తో ముగుస్తుంది. సాధారణంగా సొసైటీల కాలపరిమితి ముగిసే ఆరు నెలల ముందుగానే ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియ చేపట్టి గడువు వరకు పూర్తిచేసేది. అయితే ప్రస్తుతం వీటి నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలన అనివార్యంగా మారింది.
జిల్లాకో కేంద్ర బ్యాంకు..
కొత్త జిల్లాలు ఏర్పడినా ఉమ్మడి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఆధ్వర్యంలోనే ఏడు జిల్లాల ప్యాక్స్‌లను నిర్వహిస్తున్నారు. కొత్తగా జిల్లాకో కేంద్ర బ్యాంకు ఏర్పాటు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే ఈ ప్రక్రియకు మరింత సమయం పట్టనున్న నేపథ్యంలో ఎన్నికలు ఒకే డీసీసీబీ కింద నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా కొత్తగా 40 ప్యాక్స్‌లను ఏర్పాటు చేయాలని అధికారులు గతంలో ప్రభుత్వానికి నివేదిక పంపారు.
Comments
Please login to add a commentAdd a comment