ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరించాలి
● ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణ ఆదిత్య
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో వరి ధాన్యం సేకరణ ప్రక్రియ ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా చేపట్టాలని మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల ప్రత్యేక అధికారి కృష్ణ ఆదిత్య సూచించారు. మంచిర్యాల సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు కుమార్ దీపక్, వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్లు మోతిలాల్, దీపక్ తివారి, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావులో కలిసి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక అధికారి మాట్లాడుతూ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే క్రమంలో తేమ, తప్ప, తాలు లేకుండా తెచ్చేలా వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీరు, నీడ సౌకర్యం కల్పించాలన్నారు. టార్పాలిన్లు, గన్నీ సంచుల కొరత లేకుండా చూడాలని తెలిపారు. ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు ధాన్యం తరలించే సమయంలో రవాణా ఎగుమతి దిగుమతిలో హమాలీల నిర్వహణ ఇతర అంశాలపై పర్యవేక్షించాలని తెలిపారు. రైస్‌మిల్లుల్లో రిజిస్టర్లను స్పష్టంగా నిర్వహించాలని తెలిపారు. రైస్ మిల్లర్లతో ఒప్పందాల ప్రక్రియ పకడ్బందీగా ఉండాలన్నారు. సన్నరకం వడ్లకు ప్రభుత్వం రూ. 500 బోనస్ అందిస్తుందని, సన్నరకం, దొడ్డురకం వడ్ల సేకరణకు వేర్వేరుగా కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. రైస్ మిల్లుల్లో ధాన్యం అధికంగా ఉన్న సమయంలో గోదాంలలో నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అఽధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment