సంతకం పెడతా..
● మహిళా కార్యదర్శులకు ఎంపీడీవో వేధింపులు ● వివాదాస్పదంగా అధికారి తీరు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘ఫైళ్లపై సంతకం పెడతా.. మరి నాకేంటి? మీ ఇంటికి ఎప్పుడు పిలుస్తావు? మా ఇంటికి ఎప్పుడు వస్తావు?’ అంటూ జిల్లాలోని ఓ ఎంపీడీవో మహిళా కార్యదర్శులను వేధిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. ఆ మండల అధికారి ప్రవర్తనతో మహిళా కార్యదర్శులు ఇబ్బంది పడుతున్నారు. పైఅధికారిగా ఉండడంతో ఆయన వద్దకు వెళ్తే వంకర మాటలు మాట్లాడుతూ ఇబ్బంది పెడుతుండడంతో ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. జిల్లాలో సింగరేణి పరిధి విస్తరించిన ఓ మండల ఎంపీడీవో చేష్టలు రోజురోజుకూ శృతి మించుతున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలు పర్యవేక్షించే క్రమంలో డబుల్ మీనింగ్ మాట లు మాట్లాడడమే కాకుండా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఓ మహిళా కార్యదర్శితో ఆమె బంధువుల ఎదుటే అనుచితంగా ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాఖా పరంగానూ మహిళా ఉద్యోగులకే షోకాజ్ నోటీసులు ఇస్తూ బెదిరిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు చేపట్టిన పలు అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపులోనూ జాప్యం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ మండలం నుంచి మరో చోటుకు ఓ ఏఈ బదిలీ పై వెళ్లేందుకు రిలీవ్ ఆర్డర్ ఇచ్చేందుకు కూడా డబ్బులు అడిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఆయన వ్యవహార శైలిపై ఇప్పటికే పంచాయతీరాజ్ ఉద్యోగుల ఫోరం ప్రతి నిధుల దృష్టికి తీసుకెళ్లారు. నేడో, రేపో ఆ ఎంపీడీవో నిర్వాకంపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment