సర్వేలో ‘వలస’ ప్రశ్నలు
● ఉపాధికోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి సమాచారం సేకరణ ● సంక్షేమం కోసమే అంటున్న గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులు ● పూర్తి సమాచారం ఇవ్వాలని సూచన
నిర్మల్‌ఖిల్లా: జిల్లాలో సామాజిక, ఆర్థిక, కుల గణన కోసం ఇంటింటి సమగ్రసర్వేను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఇందులో దాదాపు 56 కాలమ్స్‌లలో ప్రధాన ప్రశ్నలు ఉండగా, అందులోని ఉపప్రశ్నలతో కలిపి మొత్తం 75 వరకు ప్రశ్నావళితో కుటుంబం సమగ్ర వివరాలను సేకరించి పొందుపరుస్తున్నారు. ఈ మేరకు నిర్మల్ జిల్లాలోనూ ఎన్యూమరేటర్లు సమాచారాన్ని సేకరించే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాల బాట పడుతున్న కార్మికుల సంఖ్య గణనీయంగా ఉంది. గల్ఫ్ కుటుంబాల సమస్యలను సర్వే ద్వారా తెలుసుకునేందుకు ప్రశ్నావళిలోని 48, 48(బి), 48(డి) ప్రశ్నల ద్వారా ఏ దేశానికి వలస వెళ్లారు...? వెళితే ఆ దేశం పేరు...? వలస వెళ్లడానికి ప్రధానమైన కారణం..? వంటి ప్రశ్నలకు ఆయా కుటుంబాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం..
సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ కుల గణన కోసం చేపడుతున్న ఇంటింటి సర్వేలో గల్ఫ్ వలస కార్మికుల కుటుంబాలు సమాచారాన్ని ఇవ్వడం ద్వారా రానున్న రోజుల్లో వారి సంక్షేమ కోసం ప్రణాళికలు అమలుపరిచే అవకాశం ఉందని గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఉన్న ఊరిలో సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో పాటు, స్వీయ వ్యవసాయ భూకమతాలు లేకపోవడం కారణాలుగా గల్ఫ్ దేశాలను వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు చెబుతున్నారు. సమగ్ర సర్వే ద్వారా పూర్తి సమాచారం నివేదిక రూపంలో అందుబాటులోకి వస్తే, తద్వారా గల్ఫ్ కార్మికుల సంఖ్య స్పష్టమవుతుంది.
రాష్ట్రాలు, దేశాలకు వేర్వేరుగా..
జిల్లాలోని పేద, మధ్య తరగతికి చెందిన చాలామంది తమ స్వస్థలాల నుంచి వివిధ కారణాల రీత్యా ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలు, దేశాలకు వలస వెళ్తున్నారు. అలా వెళ్లినవారు పూర్తి సమాచారాన్ని సమగ్ర సర్వేలో అందించాల్సి ఉంటుంది. తమ కుటుంబ సభ్యులలో ఇతర దేశాలకు వలస వెళితే 48(ఏ)వ ప్రశ్నలో కోడ్ నంబర్ 1, ఇతర రాష్ట్రాలకు వెళితే కోడ్ నంబర్ 2 గా గుర్తించాల్సి ఉంటుంది. అందులో ఏ దేశానికి వెళ్లింది కూడా తెలియజేయాల్సి ఉంటుంది. ఇక 48(బి) ప్రశ్నలో గల్ఫ్ దేశాలకు వలస వెళ్లితే కోడ్ నంబర్ 04 గా గుర్తించాలి.
పూర్తి సమాచారం ఇవ్వాలి
ప్రస్తుతం చేపడుతున్న సర్వేలో వివిధ గల్ఫ్ దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లినవారు లేదా వివిధ కారణాల రీత్యా తిరిగి వచ్చిన వారు సమగ్ర సర్వేలో ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్ల ప్రశ్నలకు పూర్తి సమాచారం అందివ్వాలి. తద్వారా రానున్న రోజుల్లో గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరేందుకు అవకాశం ఉంటుంది. దీనిని సద్వినియోగం చేసుకోవాలి.
– స్వదేశ్ పరికిపండ్ల,
గల్ఫ్ కార్మిక సంఘం నాయకుడు, నిర్మల్
Comments
Please login to add a commentAdd a comment