అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం
● కాలి బూడిదైన 25 క్వింటాళ్ల పత్తి ● రూ.5 లక్షల వరకు నష్టం
వాంకిడి: అగ్ని ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోయిన సంఘటన మండలంలోని ఇందాని గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందాని గ్రామానికి చెందిన చాప్లె ప్రకాశ్ అతని భార్యతో కలిసి శుక్రవారం ఉదయం పొలంలో పత్తి ఏరడానికి వెళ్లాడు. వారి 5 సంవత్సరాల కూతురు, 2 సంవత్సరాల కుమారుడిని పక్కనే ఉంటున్న నాన్నమ్మ ఇంట్లో వదిలి వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేరు. ఈక్రమంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంట్లో అకస్మాత్తుగా పొగలు కమ్ముకోవడంతో చుట్టుపక్కల వారు గమనించి నిప్పులు ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ గత వారం రోజులుగా ఏరిన పత్తి ఇంట్లోనే నిల్వ ఉండటం.. ఫైరింజన్ రావడంలో ఆలస్యం జరగడంతో మంటలు తీవ్రంగా చెలరేగాయి. దీంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. రెండు మేక పి ల్లలను ఇంట్లోనే కట్టేసి వెళ్లగా మంటలు చెలరేగే సమయంలో స్థానికులు బయటకు తీశారు. ఇంట్లో అమ్మేందుకు సిద్ధంగా ఉంచిన 25 క్వింటాళ్ల పత్తి, రూ.లక్ష నగదు, ఒకటిన్నర తులాల బంగారం, 12 తులాల వెండి, రెండు బెడ్లు, తదితర వస్తువులు పూర్తిగా కాలిపోయాయని దంపతులు వాపోయారు. సుమారు రూ.5 లక్షల కంటే ఎక్కువ నష్టం వాటిల్లిందని కన్నీటి పర్యంతమయ్యారు. కాగా విద్యుత్ షాక్ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment