హామీలు అమలు చేయని ఎమ్మెల్యేలు
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్
మంచిర్యాలటౌన్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం మాట్లాడారు. జిల్లాలోని ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈమేరకు చార్జ్‌షీట్ విడుదల చేసినట్లు తెలిపారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, వృద్ధులకు అనేక హామీలు ఇచ్చి నెరవేర్చలేదని పేర్కొన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు అభివృద్ధి పేరుతో అరాచకం సృష్టిస్తూ అల్లర్లను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచాక ఆరు నెలల్లో టూటౌన్ పోలీస్ స్టేషన్, రైల్వే వంతెన, 100 రోజుల్లో ఎల్లంపల్లి నిర్వాసితుల పెండింగులో ఉన్న బకాయిలు చెల్లిస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మంచిర్యాల, అంతర్గాం మధ్య గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన బ్రిడ్జి ఏమైందని నిలదీశారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి 40 వేల ఉద్యోగాలను ఇస్తామని మోసం చేసి, తన కొడుక్కు మాత్రం ఉద్యోగం ఇప్పించుకున్నాడని తెలిపారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో నష్టపోతున్న గ్రామాలకు కరకట్ట నిర్మిస్తామన్న హామీ ఏమైందని అన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ ప్రజలకు అందుబాటులో ఉండకుండా మోసం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, రజనీశ్‌జైన్, ఆరుముళ్ల పోశం, పట్టి వెంకటకృష్ణ, గుండా ప్రభాకర్, అమరరాజుల శ్రీదేవి, ఆకుల అశోక్ వర్ధన్, ఎనగందుల కృష్ణమూర్తి, మోటపలుకుల తిరుపతి, అక్కల రమేశ్, రాచర్ల సంతోష్, వాణిశ్రీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment