వైకల్యం కారాదు శాపం..! | - | Sakshi
Sakshi News home page

వైకల్యం కారాదు శాపం..!

Published Tue, Dec 3 2024 12:40 AM | Last Updated on Tue, Dec 3 2024 12:41 AM

వైకల్

వైకల్యం కారాదు శాపం..!

వైకల్యాన్ని లెక్కచేయకుండా ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొని అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న వారు ఎందరో ఉన్నారు. వైకల్యాన్ని శాపంగా పరిగణించకుండా ఆత్మవిశ్వాసంతో జయించి ఎందరో దివ్యాంగులు విజయతీరాలకు చేరుకున్నారు. నేటి సమాజంలో వైకల్యం ఉందని అధైర్య పడకుండా ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలి. ఆత్మస్థైర్యం పెంపొందించుకుని అడుగులు వేస్తే అన్ని రంగాల్లో విజయం సాధించడం కష్టమేమి కాదు. దివ్యాంగులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వాలు కూడా అనేక పథకాలను తీసుకొచ్చాయి. నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..

–మంచిర్యాలటౌన్‌

ప్రభుత్వం చేయూతనిస్తుంది

దివ్యాంగులకు ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. జిల్లాలో దాదాపు 19వేల మందికి పైగా దివ్యాంగులు ఉన్నారు. ఇప్పటికే వారికి ప్రభుత్వం నుంచి అందించే పథకాలను సమర్ధవంతంగా అందిస్తున్నాం. దివ్యాంగులు సైతం పూర్తి అవగాహన కలిగి ఉంటే, వారికి ఉన్న అవసరాన్ని బట్టి ఉపాధితో పాటు, రుణాలు పొందేందుకు వీలుంటుంది. వారికి అవసరమైన పరికరాలను సైతం ఉచితంగా అందజేస్తాం, వాటిని సద్వినియోగం చేసుకోవాలి.

– స్వరూపరాణి, ఇన్‌చార్జి జిల్లా సంక్షేమశాఖ అధికారి, మంచిర్యాల

దివ్యాంగుల శాఖను వేరు చేయాలి

గతంలో దివ్యాంగుల శాఖ ప్రత్యేకంగా ఉండగా, దానిని మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ కిందకు మార్చారు. ప్రత్యేక శాఖ ఉంటేనే దివ్యాంగులకు న్యాయం జరుగుతుంది. మహిళలకు అందిస్తున్నట్లుగానే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం అందించాలి. రూ.6 వేల పెన్షన్‌ ఇవ్వడంతో పాటు బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలను భర్తీ చేయాలి. దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కల్పించాలి. దివ్యాంగుల సంఘ భవనం నిర్మించి, ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటిని సకాలంలో అందించేలా చూడాలి.

– బూర్ల మహేందర్‌, జిల్లా నిరుద్యోగ దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకులు, మంచిర్యాల

పింఛన్లు..

దివ్యాంగులకు ప్రభుత్వం నెలకు రూ.4016లు పింఛన్‌ అందిస్తోంది. ప్రభుత్వ పింఛన్‌ కోసం ముందుగా వైకల్య నిర్ధారణకు సదరం శిబిరాల్లో వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వారు ఇచ్చే సదరం ధ్రువీకరణ పత్రంతో పాటు ఆధార్‌కార్డు తీసుకుని మున్సిపాలిటీ అయితే మున్సిపల్‌ కమిషనర్‌, గ్రామాలకు చెందిన వారైతే ఎంపీడీవో కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి.

స్వయం ఉపాధి పథకం

దివ్యాంగులు స్వయం ఉపాధి పొందేలా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా రుణ సదుపాయం కల్పిస్తోంది. 21 నుంచి 55 ఏళ్ల వయస్సు గల అన్ని విభాగాల దివ్యాంగులు బ్యాంకు ద్వారా రూ.లక్షలోపు రుణం తీసుకుంటే 80 శా తం సబ్సిడీ, రూ. 2 లక్షల వరకు అయితే 70 శాతం సబ్సిడీ, రూ. 5 లక్షలలోపు తీసుకుంటే 60 శాతం సబ్సిడీ, రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు గల రుణంపై రూ. 2.01 లక్షల సబ్సిడీ ఇస్తున్నారు. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పోరేషన్ల ద్వారా అందించే రుణాల్లోనూ 5 శాతం తప్పనిసరి గా దివ్యాంగులకు మంజూరు చేయాల్సి ఉంటుంది.

వివాహ ప్రోత్సాహకాలు

సాధారణ వ్యక్తులు దివ్యాంగురాలు/దివ్యాంగుడిని పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం ఆ జంటకు రూ. 1.16 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. సదరం ధృవీకరణ పత్రం, పెళ్లి జరిగినట్లు తీసిన మూడు ఫొటోలు, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంక్‌ఖాతా నంబర్‌ కనిపించేలా పాస్‌ పుస్తకం మొదటిపేజీ జి రాక్సు, పుట్టినతేదీకి సంబంధించి పదో తరగతి మా ర్కుల జాబితా, లేకుంటే పంచాయతీ నుంచి జారీ చేసిన ధృవీకరణ పత్రం, తహసీల్దార్‌ ద్వారా జారీ చేసిన నివాస పత్రం, వధూవరుల రేషన్‌కార్డులతో దరఖాస్తు చేసుకోవాలి.

ఉపకార వేతనాలు

ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతూ, తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామాల్లో రూ. లక్షన్నర, పట్టణాల్లో రూ. 2 లక్షలకు మించని దివ్యాంగులకు ఉపకార వేతనాలను అందజేస్తారు.1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు రూ.700, 6 నుంచి 8వ తరగతి వారికి రూ.1000, 9, 10 తరగతుల వారికి రూ.1820 చొప్పున ప్రీమెట్రిక్‌ ఉపకా ర వేతనాలను అందజేస్తోంది. పోస్ట్‌మెట్రిక్‌ ఉపకార వేతనాలు ఇంటర్మీడియెట్‌ వారికి రూ.1820, డిగ్రీ వారికి రూ. 2,400లు, పీజీ చదివే విద్యార్థులకు రూ. 4,290 చొప్పున ఏడాదికి చెల్లిస్తారు.

ధ్రువపత్రం పొందడం ఇలా..

విభిన్న ప్రతిభావంతులు ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకునేందుకు వైకల్య ధృవీ కరణ పత్రం తప్పనిసరి. దీని కోసం నిర్ణీత తేదీల్లో ప్రభుత్వాసుపత్రుల్లో సదరం వైద్య శిబిరాలను నిర్వహిస్తారు. జిల్లా కేంద్రంలో మంచిర్యాల ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో నెలలో ఒకసారి నిర్వహించే సదరం శిబిరం కోసం స్లాట్‌బుక్‌ చేసుకోవాలి. వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఇందుకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇంటి వద్దకే ఈఐఆర్టీలు

విధి వక్రీకరించి శారీరక, మానసిక, అంధ, వినికిడి, మూగ పిల్లలు జన్మిస్తే వారిని చూసి అధైర్య పడకుండా ఈఐఆర్టీలను సంప్రదిస్తే మేమున్నామంటూ ముందుకొస్తారు. పుట్టుకతోనే వినికిడి, మూగ, బుద్ధిమాంధ్యత, అంగవైకల్యంతో జన్మించిన పిల్లలకు మిగిలిన విద్యార్థుల్లా మానసిక ధైర్యం అందించి వారికి అవసరమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం వీరిని నియమించింది.

ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి అందుబాటులో ఎన్నో ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుంటే ఉన్నత శిఖరాలకు నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

జిల్లాల వారీగా పెన్షన్‌ పొందుతున్న

దివ్యాంగులు..

మంచిర్యాల 12,677 మంది

ఆదిలాబాద్‌ 6945

నిర్మల్‌ 9626

కుమురంభీం 5858

ప్రయాణం రాయితీ

దివ్యాంగులకు బస్సు, రైళ్లలో రాయితీపై ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో శారీరక వైకల్యం గల వారికి 50 శాతం రాయితీ, అంధులకు/మానసిక దివ్యాంగులకు వంద శాతం రాయితీ, వారితో పాటు వెళ్లే ఒక్కరికి 50 శాతం రాయితీ కల్పిస్తున్నారు. రైలు ప్రయాణ ఖర్చుల్లో వారితో పాటు తోడుగా వెళ్లే వారికి 50 శాతం రాయితీ అందిస్తున్నారు. వైకల్యం ఉన్నట్లు మెడికల్‌ బోర్డు, సదరం వైద్య శిబిరం ద్వారా మంజూరు చేసిన వైకల్య ధృవీకరణ పత్రం, వైకల్యం కనిపించేలా మూడు ఫొటోలతో సమీప ఆర్టీసీ డిపో మేనేజర్లను సంప్రదిస్తే, వారు బస్‌పాస్‌ మంజూరు చేస్తారు. రైల్వే పాస్‌ను మెడికల్‌ బోర్డు వారు అందిస్తారు.

ఉపకరణాలు

శారీరక వైకల్యం కలిగిన వారికి మూడు చక్రాల బండి, చంక కర్రలు, క్యాలిపర్స్‌, మూగ, చెవుడు వైకల్యం కలిగిన వారికి శ్రవణ పరికరాలు, అంధులకు చేతికర్ర, బ్రెయిలీ పలక, ఎంపీ 3 ప్లేయర్‌, ల్యాప్‌టాప్‌లను ఉచితంగా అందజేస్తారు. సొంత వాహనం, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండి, స్వయం ఉపాధి పొందుతున్న నిరుద్యోగ శారీరక దివ్యాంగులకు పెట్రోలు రాయితీని కూడా కల్పిస్తారు. 18 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండి కుటుంబ ఆదాయం గ్రామాల్లో రూ.లక్షన్నర, పట్టణాల్లో రూ. 2 లక్షలకు మించని వారు, ప్రొఫెషనల్‌ ఉన్నత విద్యను అభ్యసించే శారీరక వైకల్యం కలిగిన వారికి మూడు చక్రాల వాహనం ఉచితంగా అందిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
వైకల్యం కారాదు శాపం..!1
1/2

వైకల్యం కారాదు శాపం..!

వైకల్యం కారాదు శాపం..!2
2/2

వైకల్యం కారాదు శాపం..!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement