గిరిజనుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా
ఉట్నూర్‌రూరల్: గిరిజనుల సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ఆర్జీలను స్వీకరించారు. గాదిగూడ మండలానికి చెందిన గ్రామస్తులు తమ గ్రామానికి అంగన్వాడీ సెంటర్, సీసీ రోడ్డు మంజూరు చేయించాలని, బేల మండలం బోరిగాం గ్రామానికి చెందిన గ్రామస్తులు తమ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని, నార్నూర్ మండలం తడిహత్నూర్ గ్రామానికి చెందిన పురుషోత్తం తనకు ఫొటోగ్రఫీ ఉద్యోగం కల్పించాలని, ఇంద్రవెల్లి మండలానికి చెందిన బాలు తనకు బోర్‌వెల్ మంజూరు చేయాలని కోరారు. పింఛన్లు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయం, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు సమర్పించారు. ఏపీవో వసంత్‌రావు, ఏపీవో పీవీటీజీ మెస్రం మనోహర్, పీహెచ్‌వో సందీప్‌కుమార్, డీపీవో ప్రవీణ్, మేనేజర్ లింగు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
50 ఎల్‌టీఆర్ కేసులు పరిష్కారం..
గత మూడు నెలల్లో సెప్టెంబర్ 1 నుంచి ఉట్నూర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో మొత్తం 50 ఎల్‌టీఆర్ కేసులు పరిష్కరించినట్లు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జైనూర్, జైనథ్, తిర్యాణి, మందమర్రి మండలాలలోని గిరిజన రైతులకు 30 ఎకరాల భూమిని స్వాధీనం చేశామన్నారు. ఉట్నూర్, ఇంద్రవెల్లి, బేల, ఆదిలాబాద్, కెరమెరి, దండెపల్లి మండలాల్లోని 50 ఎకరాల భూమి ప్రభుత్వానికి స్వాధీనం చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment