బెల్లంపల్లి ఏరియాలో 135 శాతం బొగ్గు ఉత్పత్తి
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలో గత నెలలో 135 శాతం బొగ్గును ఉత్పత్తి చేశామని ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. సోమవారం గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెలలో ఏరియాకు 2.50 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేషించగా 3.39 లక్షల టన్నుల ఉత్పత్తిని చేపట్టి ఉత్పత్తిలో 135 శాతం నమోదు చేసినట్లు తెలిపారు. వర్షాకాలంలో అధిక వర్షాల కారణంగా కోల్పోయిన ఉత్పత్తిని ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న కాలంలో సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అక్టోబర్‌లో వర్షాలు లేకపోవడంతో 135 శాతం ఉత్పత్తిని సాధించగలిగామన్నారు. ఇదే తరహాలో ఉత్పత్తి ప్రక్రియ కొనసాగించి ఆర్థిక సంవత్సరానికి నిర్దేషించిన వార్షిక లక్ష్యాన్ని సాధిస్తామని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 21.80 లక్షల టన్నుల లక్ష్యానికి గానూ 19.78 లక్షల టన్నులను ఉత్పత్తి చేసి 91శాతంలో బెల్లంపల్లి ఏరియా ముందుకు సాగుతోందన్నారు. త్వరలో కంపెనీ లెవల్ క్రికెట్ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. డీజీఎం ఐఈడీ ఉజ్వల్‌కుమార్ బెహారా, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment