చలి.. జర జాగ్రత్త
మంచిర్యాలటౌన్: జిల్లాలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 11డిగ్రీలకు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. చలితో చర్మం పొడిబారి పగుళ్లు రావడతోపాటు అలర్జీ, చర్మం ఎర్రబడడం, దురద వంటి శీతాకాలపు చర్మవ్యాధులు, అస్తమా వ్యాధిగ్రస్తులు శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో సతమతం అయ్యే అవకాశం ఉంది. చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు సూచనలు చేస్తున్నారు.
చిన్నారులు రక్షణ పొందాలి
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, చిన్నారులు, వృద్ధులు చలిగాలుల నుంచి రక్షణ పొందడంతోపాటు గాలి నేరుగా తగలకుండా చూసుకోవాలి. చలిగాలులు వీస్తున్నప్పుడు ఇంటి తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి. శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా ఉండేలా పొడి దుస్తులు, ఊలు స్వెట్టర్లు ధరించాలి. చలి తీవ్రత కారణంగా అన్ని వయసుల వారితోపాటు పిల్లల్లో జలుబు, దగ్గు, జ్వరం తదితర సమస్యలు ఎక్కువగా ఉంటాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైతే వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలి. నెలలోపు చిన్నారులకు స్నానం చేయించవద్దు. పిల్లలను వేడి గదుల్లో ఉంచాలి. కాటన్ దుస్తులు తొడిగి, చలిని బట్టి దుప్పట్లు కప్పాలి. పిల్లలను బైక్‌లపై ముందు కూర్చోబెట్టుకోవద్దు. ఫ్యాన్ కింద నేరుగా పడుకోబెట్టవద్దు.
– డాక్టర్ అభినవ్, ఎండీ జనరల్ ఫిజీషియన్, మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి
నీరు ఎక్కువగా తాగాలి
చలికాలంలోనూ తప్పనిసరిగా నాలుగు నుంచి ఐదు లీటర్లు నీరు తాగాలి. ఎక్కడికి వెళ్లినా మాస్క్ ధరించాలి. దుమ్ము, ధూళి పీల్చుకోకుండా చూడాలి. దైనందిన ఆహారం అనంతరం నువ్వులతో చేసిన పదార్థాలు తీసుకుంటే జీర్ణమవుతుంది. అన్ని రకాల డ్రైఫ్రూట్స్ తీసుకుంటే రక్తాన్ని శుద్ధి చేసి మనిషికి అవసరమైన శక్తిని ఇస్తాయి. చిలకడ దుంపలు ఉడికించి తింటే శరీరానికి కావాల్సిన వెచ్చదనం ఇస్తాయి. చలికాలంలో దగ్గు, జలుబు, వైరస్ వంటి ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. ఉసిరి కాయలను తీసుకుంటే సీ విమిన్, యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఉపయోగపడుతాయి. అన్నం, కూరగాయలు, ఆకు కూరలతోపాటు వారానికి ఒకసారి జొన్నరొట్టె తింటే అందులో పుష్కలంగా ఉండే కాల్షియం వల్ల కండరాల కదలిక బాగా ఉంటుంది. ఫ్రిజ్‌లో పెట్టినవి, నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తినకుండా అప్పుడే వండిన వాటిని, వేడి వేడి ఆహారాన్ని తినడం చేస్తూనే బయట ఆహారానికి వీలైనంతగా దూరంగా ఉండాలి. – డాక్టర్ హరీశ్‌రాజ్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి
– వివరాలు 8లోu
Comments
Please login to add a commentAdd a comment