ట్రేడర్లపైనే భారం..!
● మామిడికాయల కొనుగోళ్లకు కసరత్తు ● ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్లతో అధికారుల చర్చలు ● ట్రేడ్‌లైసెన్స్ తీసుకోవడానికి సుముఖత
బెల్లంపల్లి: బెల్లంపల్లిలో మామిడి మార్కెట్ ఉన్నా క్రయవిక్రయాలకు నోచుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అనివార్యంగా నాగ్‌పూర్ తీసుకెళ్లి విక్రయించాల్సి వస్తోంది. ఈసారి మార్కెటింగ్ శాఖ అధికారులు ఓ అడుగు ముందుకేసి కొనుగోళ్ల కోసం ప్రయత్నాలు చేయడం, ట్రేడ ర్లు, కమీషన్ ఏజెంట్లు సుముఖత వ్యక్తం చేయడంతో మామిడికాయల అమ్మకం, కొనుగోళ్లపై రైతుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఉద్యానవన శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 17,538 ఎకరాల్లో మామిడి తోట లు విస్తరించి ఉన్నాయి. వీటి ద్వారా యేటా గరిష్టంగా రూ.200 కోట్లకు పైగా మామిడి వ్యాపారం జరుగుతోందని అంచనా. అయినా ఇటు రైతులకు ప్రయోజనం లేకపోగా.. అటు మార్కెటింగ్ శాఖ ఆదాయం కోల్పోతోంది. మామిడికాయలు, పండ్లు మహారాష్ట్రలోని నాగ్‌పూర్ మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయిస్తుండడంతో అక్కడి వ్యాపారులు, దళారులకు కలిసి వస్తోంది. సిండికేట్‌గా మారి మామిడి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు.
మార్కెట్ ఉన్నా..
బెల్లంపల్లి కేంద్రంగా 2015లో మ్యాంగో మార్కెట్ మంజూరైంది. రూ.126 కోట్ల అంచనాతో వ్యవసా య మార్కెట్ కమిటీ కార్యాలయం పక్కన రెండు మ్యాంగో కవర్ షీట్స్, ప్రహరీ నిర్మించారు. ఏళ్లు గడుస్తున్నా క్రయవిక్రయాలు జరగక అలంకారప్రాయంగా మారింది. 2003లో అదనపు సౌకర్యాల కోసం రూ.1.18 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. రూ.8లక్షల అంచనాతో ఆర్వో ప్లాంటు, రూ.36లక్షలతో మార్కెట్ ఆవరణలో సీసీ రోడ్లు వేశారు. రూ.74లక్షలతో అదనంగా మరో కవర్‌షీట్ నిర్మించాల్సి ఉన్నా టెండర్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం ఉన్న సౌకర్యాలతో క్రయవిక్రయాలకు అవకాశాలు ఉన్నా నిష్ప్రయోజనమే అవుతోంది.
లైసెన్స్‌కు ముందుకు రాని వ్యాపారులు
మామిడి కాయల కొనుగోళ్లలో ట్రేడర్లు, కమీషన్ ఏ జెంట్ల పాత్ర ఎంతగానో ఉంటుంది. మార్కెటింగ్ శాఖ నుంచి ట్రేడ్ లైసెన్స్‌లు తీసుకోవడానికి ఎవ రూ ముందుకు రావడం లేదు. ప్రతీసారి మామిడి సీజన్‌కు ముందు ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్లు, రైతులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పి స్తున్నా సానుకూలత వ్యక్తం కావడం లేదు. శీతల గిడ్డంగులు, కనీస సౌకర్యాలు లేవని ట్రేడర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతానికి భిన్నంగా ఈసా రి కొందరు ట్రేడ్‌లైసెన్స్ తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు చె బుతున్నారు. జగిత్యాల మామిడి మార్కెట్‌లో కొనుగోళ్ల తీరును పరిశీలించి ఈసారి బెల్లంపల్లిలో కొనుగోళ్లకు చర్యలు తీసుకుంటామని అంటున్నారు.
చర్యలు తీసుకుంటున్నాం
మామిడి ఉత్పత్తులకు మద్దతు ధర దక్కడానికి మార్కెటింగ్ శాఖ అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ట్రేడర్లు ముందుకు వస్తే గానీ మ్యాంగో మార్కెట్‌లో క్రయవిక్రయాలు చేపట్టలేం. ఇప్పటికే ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్లు, రైతులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి అవగాహన కల్పించాం. కొందరు ట్రేడర్లు లైసెన్స్ తీసుకోవడానికి అంగీకరించారు.
– మహ్మద్ షాబుద్దీన్, మార్కెటింగ్ శాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment