అందుగులగూడలో ఉద్రిక్తత
● డీఎడ్ విద్యార్థిని వెంకటలక్ష్మి మృతదేహంతో ఆందోళన ● మృతికి అధికారుల నిర్లక్ష్యమేనని కుటుంబీకులు ఆరోపణ ● సబ్ కలెక్టర్ శ్రద్దశుక్లా హామీ మేరకు ఆందోళన విరమణ
బెజ్జూర్: మండలంలోని అందుగులగూడ గ్రామానికి చెందిన డీఎడ్ విద్యార్థిని తొర్రెం వెంకటలక్ష్మి శుక్రవారం ఆసిఫాబాద్ పట్టణంలోని బీసీ బాలికల పోస్ట్ మెట్రిక్ వసతిగృహంలో అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. అధికారుల నిర్లక్ష్యంతోనే వెంకటలక్ష్మి ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆమె మృతదేహంతో ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనకు బీఆర్‌ఎస్ నాయకులు, గ్రామస్తులు, యువజన సంఘాల నాయకులు మద్దతు పలికారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతోపాటు వెంకటలక్ష్మి మృతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న తహసీల్దార్ భూమేశ్వర్ బాధిత కుటుంబ సభ్యులతో చర్చలు జరిపి ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పినా వారు వినలేదు. ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు రాజు, సారయ్య, రాంప్రసాద్‌ను పోలీసులు ఠాణాకు తరలించారు.
సబ్ కలెక్టర్ హామీతో..
మృతిరాలి కుటుంబ సభ్యులను కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లా పరామర్శించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు మృతిరాలి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా కలెక్టర్‌కు నివేదిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆమె వెంట కౌటాల సీఐ రమేశ్, ఎస్సైలు మధుకర్, ప్రవీణ్ ఉన్నారు.
బీసీ హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని బీసీ బాలికల పోస్ట్ మెట్రిక్ హాస్టల్‌లో ఉంటూ శ్రీనిధి డీఈడీ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థిని వెంకటలక్ష్మి అనారోగ్యంతో మృతి చెందడంపై కలెక్టర్ వెంకటేశ్ దోత్రే స్పందించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్టల్ వార్డెన్ నిఖత్ తరన్నుమ్‌ను సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు బీసీ సంక్షేమశాఖ అధికారి సజీవన్ ఓ ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment