బెల్లంపల్లి బస్‌డిపోపై నీలినీడలు | - | Sakshi
Sakshi News home page

బెల్లంపల్లి బస్‌డిపోపై నీలినీడలు

Published Mon, Dec 23 2024 12:11 AM | Last Updated on Mon, Dec 23 2024 12:11 AM

బెల్ల

బెల్లంపల్లి బస్‌డిపోపై నీలినీడలు

● ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ● నియోజకవర్గ ప్రజల నిరాశ

బెల్లంపల్లి: బెల్లంపల్లిలో ఆర్టీసీ బస్‌ డిపో మంజూరుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇంతకాలం నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆశతో ఉండగా.. నిరాశ ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లాలో కొత్తగా చెన్నూర్‌ కేంద్రంగా ఆర్టీసీ బస్‌ డిపో ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండడంతో బెల్లంపల్లికి మంజూరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చెన్నూర్‌లో బస్‌ డిపో మంజూరుకు బీజం పడగా.. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ ప్రక్రియ కొనసాగింపునకు చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో డిపో అంశాన్ని చెన్నూర్‌ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ ప్రస్తావించగా.. మంత్రి పొన్నం ప్రభాకర్‌ సుముఖత వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న స్థల వివాదం పరిష్కారం కాగానే డిపో ఏర్పాటుకు చర్యలు చేపడుతామని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో బెల్లంపల్లికి డిపో మంజూరయ్యే అవకాశాలు దాదాపు మృగ్యమనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఏ ఎన్నికలు జరిగినా బెల్లంపల్లిలో బస్‌ డిపో మంజూరు హామీ ఇవ్వడం.. గెలిచిన తర్వాత విస్మరించడం పరిపాటిగా మారింది.

జిల్లాలో ఒకే డిపో

జిల్లాలో మంచిర్యాల, చెన్నూర్‌, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు, 18 మండలాలు ఉన్నాయి. సగానికి పైగా మండలాలు గ్రామీణ ప్రాంత నేపథ్యాన్ని కలిగి ఉన్నాయి. వీటి పరిధిలో బీటీ రోడ్ల నిర్మాణం జరుగుతుండగా.. రవాణా సౌకర్యాలు లేవు. ఆర్టీసీ సేవలు అంతంత మాత్రమే కావడంతో అనివార్యంగా పల్లె ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తప్ప ఎక్కడా ఆర్టీసీ బస్‌ డిపో లేదు. ఒకే డిపో ఉండడంతో ప్రయాణికుల అవసరాలను తీర్చలేకపోతోంది. రోడ్డు సదుపాయం ఉన్న ప్రతీ పల్లెకు బస్సు సౌకర్యం కల్పిస్తామన్న ఆర్టీసీ నినాదం ఆచరలో అమలుకు నోచుకోవడం లేదు.

తెరపైకి వచ్చినా..

బొగ్గు గనులతో ఏర్పాటైన బెల్లంపల్లికి ఎంతో ఘన చరిత్ర ఉన్నా ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ప్రగతికి నోచుకోవడం లేదు. పురాతన పారిశ్రామిక క్షేత్రం బెల్లంపల్లి కేంద్రంగా ప్రభుత్వం ఆర్టీసీ బస్‌ డిపో మంజూరు చేయాలనే డిమాండ్‌ దశాబ్దాల క్రితం తెరమీదకు వచ్చినా ఎలాంటి పురోగతి లేకుండా ఉంది. చెన్నూర్‌లో బస్‌డిపో మంజూరు అంశం ప్రస్తావనకు రాకముందు నుంచే బెల్లంపల్లికి బస్‌డిపో ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఉన్నా ఆచరణలో అమలుకు నోచుకోలేదు. ఇక్కడి పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరయ్యేలా చర్యలు తీసుకోవడంలో ఈ ప్రాంతం నుంచి ఎన్నికవుతున్న ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి లేదనే విమర్శలు వస్తున్నాయి. బస్‌ డిపో కోసం బెల్లంపల్లి ఆర్టీసీ బస్టాండ్‌ను ఆనుకుని 8 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూ మిని ఏళ్ల క్రితమే సేకరించి సిద్ధంగా ఉంచారు. కానీ ఆ దిశగా సరైన యత్నాలు చేయకపోవడం శాపంగా మారింది. చెన్నూర్‌లో బస్‌డిపో మంజూరైతే జిల్లాలో డిపోల సంఖ్య రెండుకు చేరుతుంది. ఈ క్రమంలో బెల్లంపల్లి కేంద్రంగా మూడో డిపో మంజూరు చేస్తారా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఎమ్మెల్యే హామీ నిలబెట్టుకోవాలి

ఎమ్మెల్యేగా గెలిపిస్తే బె ల్లంపల్లిలో ఆర్టీసీ బస్‌ డిపో మంజూరు చేయిస్తానని గడ్డం వినోద్‌ ఎ న్నికల ప్రచారంలో భా గంగా ప్రజలకు హామీ ఇచ్చారు. గెలిచి ఇప్పటికి ఏడాది కాలం గడిచిపోయింది. కానీ ఇంతవరకు ఆ హామీ నెరవేర్చడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా చెన్నూర్‌లో బస్‌ డిపో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన కూడా ఎమ్మెల్యే సోయి లేకుండా వ్యవహరించడం శోచనీయం. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.

– రాచర్ల సంతోష్‌, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్‌

ఎంతో అవసరం

బెల్లంపల్లిలో ఆర్టీసీ బస్‌ డిపో ఏర్పాటు చేయాల్సిన ఆవసరం ఎంతైనా ఉంది. చుట్టుపక్క ప్రాంతాల ప్రజలు, గ్రామీణులు బెల్లంపల్లికి వచ్చి సుదూర ప్రాంతాలకు రాకపోకలు చేస్తుంటారు. సరిపడా బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నా రు. బస్‌డిపో ఏర్పాటు వల్ల ఆర్టీసీకి ఆదాయంతోపాటు ప్రయాణికులకు సౌకర్యం కలుగుతుంది. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బెల్లంపల్లికి బస్‌ డిపో మంజూరు చేయాలి.

– అక్కెపల్లి బాపు,

బీకేఎంయూ జాతీయ సమితి సభ్యుడు

No comments yet. Be the first to comment!
Add a comment
బెల్లంపల్లి బస్‌డిపోపై నీలినీడలు1
1/2

బెల్లంపల్లి బస్‌డిపోపై నీలినీడలు

బెల్లంపల్లి బస్‌డిపోపై నీలినీడలు2
2/2

బెల్లంపల్లి బస్‌డిపోపై నీలినీడలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement