ర్యాలీవాగు ఎడమ కాలువకు గండి
● పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు ● మరమ్మతులకు సిద్ధమవుతున్న రైతులు
మంచిర్యాలరూరల్(హాజీపూర్) హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామం పోచంపాడు శివారులోని ర్యాలీవాగు ప్రాజెక్టు ఎడమ కాలువకు గండి పడింది. రెండేళ్ల క్రితం ఈ కాలువకు గండి పడగా రైతులే స్వయంగా గండి పూడ్చుకుని పంటలకు నీరందించుకుంటున్నారు. ఈ కాలువ కింద పోచంపాడు, వేంపల్లి, రంగపేటకు చెందిన 50 మంది రైతులకు చెందిన 300 ఎకరాలకు సాగునీరు అందుతుంది. రెండేళ్ల క్రితం భారీ వర్షాలతో కాలువకు గండి పడింది. అయితే గండి పూడ్చడంలో ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గండి పూడ్చాలని రైతులు పలుమార్లు ఏఈఈకి విన్నవించారు. అయినా మరమ్మతు చేయలేదు. దీంతో రైతులే రెండేళ్లుగా ఇసుక బస్తాలతో గండి పూడ్చుకుంటున్నారు. రబీ సీజన్ సాగుకు సిద్ధమైన రైతులు ఇప్పటికీ గండి పూడ్చకపోవడంతో యాసంగి పంటలకు నీరందేలా మరోమారు గండి పూడ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు ఎకరాకు రూ.200 చొప్పున డబ్బులు వసూలు చేస్తున్నారు. గండికి శాశ్వత మరమ్మతుకు ప్రణాళిక వేసుకుంటున్నారు. ఈ విషయమై ఇరిగేషన్ డీఈ కుమార్‌ను వివరణ కోరగా గండి మరమ్మతు కోసం నివేదిక రూపొందించామని, ఉన్నతాధికారుల నుంచి అనుమతి, నిధులు రాలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment