అమిత్‌షాను బర్తరఫ్ చేయాలి
● పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాలటౌన్/బెల్లంపల్లి/మందమర్రిరూరల్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి అమిత్‌షాను బర్తరఫ్ చేయలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాలలో అమిత్‌షా వ్యాఖ్యలపై మంగళవారం వేర్వేరుగా నిరసన తెలిపారు. మందమర్రి సింగరేణి హైస్కూల్ ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బెల్లంపల్లిలోనూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. మంచిర్యాలలోని తన నివాసంలోనూ కేంద్రమంత్రి తీరును ఖండించారు. అమిత్‌షా క్షమాపణ చెప్పి పదవికి రాజీనామా చేయాలని రాహుల్‌గాంధీతో కలిసి పార్లమెంటులో ధర్నా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అంబేద్కర్‌తోపాటు, బడుగు బలహీనవర్గాలను కించపరిచేలా అమిత్‌షా మాట్లాడారన్నారు. పార్లమెంటు ఎన్నికల్ల తక్కువ సీట్లు వచ్చినా రాజ్యాంగం మార్చేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. దేశం మొత్తం తమ రాజ్యాంగమే ఉండాలని ముందుకు వెళ్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు బీజేపీ నిజస్వరూపం బయటపడి ఉంటే, 240 సీట్లు కూడా వచ్చేవి కావన్నారు. కార్యక్రమాల్లో దళిత, బీసీ సంఘాల నాయకులు కుంబాల రాజేశ్, కాసర్ల యాదగిరి, సబ్బని రాజనర్సు, దుర్గం గోపాల్, ఎండీ ఈసా, సిరంగి శంకర్, ఎలిగేటి శ్రీనివాస్, ఎల్తురి శంకర్, పొట్ల సురేశ్, మాజీ సర్పంచ్ మంద అనిత, వెంకటస్వామి, రాంనాధ్, మనోహర్, కాంగ్రెస్ మందమర్రి పట్టణ అద్యక్షుడు ఉపేందర్‌గౌడ్, మండల ఇన్‌చార్జి కడారి జీవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment