ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు
● కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: ఇసుక అక్రమంగా రవాణాచేస్తే కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్‌కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టర్ చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఏడాది చింతపల్లి వేబ్రిడ్జి నుంచి 328 ట్రిప్పుల్లో 1,312 మెట్రిక్ టన్నుల ఇసుకను రూ.47,468కు విక్రయించడం జరిగిందన్నారు. కొల్లూర్ 3 వేబ్రిడ్జి నుంచి 78 ట్రిప్పుల్లో సూమారు 2,340 మెట్రిక్ టన్నుల ఇసుకను రూ.8,77,500లకు విక్రయించామన్నారు. ఒక ట్రిప్పులో దాదాపు 30 మెట్రిక్ టన్నుల ఇసుక ఉంటుందని, అంతకు మించి ఉన్నట్లయితే ఆన్‌లోడింగ్ చేయడం జరుగుతుందన్నారు. ఒక కిలో ఇసుక కూడా నిబంధన మించి లోడింగ్ చేయడం జరుగలేదన్నారు. ఈ ఏడాదిలో ఓవర్ లోడ్‌తో వెళ్తున్న ఇసుక వాహనాలపై 4 కేసులు నమోదు చేసి రూ.2,12,360 జరిమానా విధించామన్నారు. 686 ట్రిప్పుల్లో తరలిస్తున్న 2,744 మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చేసి రూ.74,088 జరిమానా విధించామన్నారు. ఇసుక డంప్, తరలింపు వివరాల నమోదు వంటి అన్ని అంశాలు పారదర్శకంగా జరుగుతున్నాయన్నారు. హాజీపూర్ మండలం ముల్కల్ల, చెన్నూర్ మండలం అక్కెపల్లి, నెన్నెల మండలం ఖర్జీ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ల ద్వారా స్థానిక అవసరాలకు ఇసుకను వినియోగించడం జరుగుతుందన్నారు. ఇసుక అక్రమ రవాణాపై వివిధ కోణాలలో పత్రికలు, చానళ్లలో కథనాలు వస్తున్నాయని, ఒక్కసారి ప్రజలలోకి వెళ్లిన వార్తను తిరిగి తీసుకోలేమని, పూర్తిస్తాయిలో నిజ నిర్దారణ చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment