ధాన్యం బోనస్ కోసం అక్రమాలు
దండేపల్లి(మంచిర్యాల): సన్నరకం వరి ధాన్యానికి ప్రభుత్వం అందిస్తున్న రూ.500 బోనస్ నొక్కేసేందుకు ప్రయత్నించిన అక్రమార్కులు అడ్డంగా దొరికారు. దండేపల్లి మండలంలో ఈ సంఘటన వెలుగు చూసింది. శుక్రవారం దండేపల్లి పోలీసుస్టేషన్‌లో ఎన్‌ఫోర్స్‌మెంటు డీటీలు లింగయ్య, అంజన్న, స్రవంతి వివరాలు వెల్లడించారు. మండలంలోని కొత్తమామిడిపల్లికి చెందిన ఎంబడి సురేందర్, ధనిశెట్టి నరేష్ గ్రామంలోని కొందరు రైతుల నుంచి 70 కిలోల బరువు గల 295 బస్తాల సన్నరకం వరి ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకంటే తక్కువకు క్వింటాల్‌కు రూ.2,650 చొప్పున కొనుగోలు చేశారు. లారీలో జమ్మికుంటలోని ఓ రైస్‌మిల్‌కు తరలిస్తుండగా ఆర్‌ఐ భూమన్న గూడెం చెక్‌పోస్ట్ వద్ద గురువారం రాత్రి పట్టుకున్నారు. ధాన్యాన్ని తరలించేందుకు గ్రామ పంచాయతీ నుంచి ఇచ్చిన ఫాం నంబరు 10లో గ్రామ ప్రత్యేకాధికారి, తహసీల్దార్ సంధ్యారాణి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. ఫోర్జరీ చేసినట్లు ఎంబడి సురేందర్ ఒప్పుకోవడంతో ధాన్యం లారీని దండేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఖాళీ గన్నీ సంచులు
ధాన్యం లారీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీలు పరిశీలించి ఆరాతీయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. లారీలో 70 కిలోల బరువు గల 295 సన్నరకం వరి ధాన్యం బస్తాలతో పాటు సివిల్ సప్లయ్‌కి సంబంధించిన 570 ఖాళీ గన్నీ సంచులు లభ్యమయ్యాయి. 70 కిలోల సంచుల్లోని వరి ధాన్యాన్ని రైస్‌మిల్‌కు చేరవేసి అక్కడ సివిల్ సప్లయ్‌కి సంబంధించిన ఖాళీ గన్నీ సంచుల్లో నింపి సన్నరకం వరి ధాన్యానికి ప్రభుత్వం అందించే రూ.500 బోనస్‌ను రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన మధ్యవర్తులు, సెంటర్ నిర్వాహకులు నొక్కేయనున్నట్లు తేలింది. ధాన్యం కొనుగోలు చేసిన ఇద్దరు వ్యక్తులతో పాటు ఖాళీ గన్నీ సంచులు ఇచ్చిన సెంటర్ నిర్వాహకురాలు శ్రీలతపై కేసు నమోదు చేస్తామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీలు వెల్లడించారు. సమావేశంలో స్థానిక ఆర్‌ఐ బొద్దుల భూమన్న పాల్గొన్నారు.
అడ్డంగా దొరికిన పలువురు
కేసు నమోదు చేసిన అధికారులు
Comments
Please login to add a commentAdd a comment