ఆర్‌కేపీ అభివృద్ధికి ‘ఎస్టేట్’ కొర్రీలు?
● సీఅండ్‌ఎండీ ఆదేశాలూ బేఖాతర్ ● కుంటిసాకులతో కాలయాపన ● శ్మశానవాటిక స్థలం కేటాయింపులో మీనమేషాలు ● డంప్‌యార్డు ఏర్పాటులోనూ నిర్లక్ష్యం
రామకృష్ణాపూర్: సింగరేణి సంస్థ.. మందమర్రి ఏరియా పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణ అభివృద్ధికి ఎస్టేట్ విభాగం శాపంగా పరిణమించింది. ఇక్కడ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారుతోంది. సింగరేణి కాలరీస్ కంపెనీ సీఅండ్‌ఎండీ బలరాంనాయక్ ఆదేశించినా.. పలు అభివృద్ధి పనులకు ఉద్దేశపూర్వకంగానే ఆటంకం కలిగిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. క్యాతనపల్లి మున్సిపాలిటీగా పిలువబడుతున్న రామకృష్ణాపూర్ పట్టణం సింగరేణి ప్రాంతం. ఇక్కడున్న 22 వార్డుల్లో దాదాపు 18 వార్డుల పర్యవేక్షణ సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా ఆధీనంలోనే ఉంది. ఈ క్రమంలో పట్టణ అభివృద్ధి విషయంలో సంస్థ అధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయినా కొన్ని దశాబ్దాల నుంచి వినిపిస్తున్న శాశ్వత శ్మశానవాటిక ఏర్పాటును పరిగణలోకి తీసుకున్న పాపాన పోలేదు. పార్టీలకతీకంగా నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ సమస్యపై వినతిపత్రాలు ఇచ్చినా మంజూరు కాలేదు. 35 వేలకు పైగా జనాభా ఉన్న పట్టణంలో శ్మశానవాటికకు స్థలం లేదు.
డంపింగ్ యార్డు సంగతి అంతే..
డంపింగ్ యార్డు ఏర్పాటు రామకృష్ణాపూర్ పట్టణ వాసుల మరో ప్రధాన డిమాండ్. బీఆర్‌ఎస్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే డంపింగ్ యార్డు ఏర్పాటు అనివార్యతను వెల్లడించారు. ప్రస్తుత ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి సైతం పట్టణ ప్రజలు డంపింగ్ యార్డు గూర్చి చెప్పారు. సింగరేణి సీఅండ్‌ఎండీ బలరాంనాయక్‌ను కలిసి వచ్చారు. శాశ్వత స్మశాన వాటికతో పాటు డంపింగ్ యార్డు ఏర్పాటుకోసం స్థలం కేటాయించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన సీఅండ్‌ఎండీ ఆయా పనుల నిమిత్తం స్థలం కేటాయించాలని ఏరియా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయినా ఆ దిశగా అడుగులు పడడం లేదు.
స్థలం కేటాయింపునకు ఆటంకం..
శ్మశానవాటిక, డంపింగ్ యార్డు కోసం స్థలం కేటాయింపులో సింగరేణి ఎస్టేట్ విభాగం కొర్రీలు పెడుతోంది. స్థానిక స్టోర్స్ ప్రాంతంలో ఉన్న సింగరేణి ఖాళీ స్థలంలో శ్మశానవాటిక ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాలని కోరుతున్నా.. సంబంధిత శాఖ పెడచెవిన పెడుతోందని అంటున్నారు. డంపింగ్ యార్డు పరిస్థితి అలాగే ఉంది. ఏరియా ఉన్నతాధికారులు స్థలం ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నా.. ఎస్టేట్ విభాగం అధికారులే అడ్డుగా నిలుస్తున్నారనే అభిప్రాయం ఉంది. ఎమ్మెల్యే వినతిపత్రం ఇచ్చినా.. సంస్థ సీఅండ్‌ఎండీ సూచించినా.. ఎస్టేట్ శాఖకు అభ్యంతరాలు ఏమిటని పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment