స్థానిక సంస్థల్లో గెలవాలి
సాక్షి,ఆదిలాబాద్/కై లాస్‌నగర్: ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో వందకు వందశాతం గెలవాలి.. ఇప్పటినుంచే సిద్ధం అవ్వండి.. పార్టీ కుటుంబం లాంటి ది.. మనస్పర్థలు సహజం.. సమస్యలు ఉంటే చర్చించుకొని ముందుకెళ్లాలి.. విభేదాలతో నష్టపోయే పరిస్థితి ఉంటుంది.. పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం అవసరం.. ఆ దిశగా పార్టీ ప్రయత్నిస్తుంది.. గాంధీభవన్ తలుపు ఎవరు తట్టినా అందుబాటులో ఉంటా.. కార్యకర్తల్లో కొంత నిరాశ వాస్తవమే.. వచ్చే నాలుగేళ్లలో అందరికీ న్యాయం చేస్తాం’ అని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ స్థాయి సమావేశం..
కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్‌స్థాయి సమావేశం జిల్లా కేంద్రంలోని పద్మనాయక గార్డెన్‌లో సోమవారం మధ్యాహ్నం నిర్వహించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి, రాష్ట్ర మంత్రి సీతక్క, ఏఐసీసీ సెక్రెటరీ విశ్వనాథన్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తదితరులు హాజరయ్యారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన సమావేశం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది.
ఏడాది పాలన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలి..
బీఆర్‌ఎస్ పదేళ్లలో చేయలేనిది కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో చేసి చూపెట్టిందని మహేశ్‌కుమార్ అన్నారు. అయితే ఆ పార్టీ సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తుంది. దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఏడాది పాలన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదే. 55వేల ఉద్యోగాలు ఇచ్చాం. సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వబోతున్నాం. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. వీటన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేలా కార్యకర్తలు కష్టపడాలని ఆయన అన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ అభివృద్ధికి కృషి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద ప్రణాళిక ఉంది. ఆసియాలోనే అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పండిస్తున్నారు. ఈ క్రమంలో స్థానికంగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేయబోతున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుతో పాటు వివిధ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, రాష్ట్ర మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, నియోజకవర్గ ఇన్‌చార్జీలు శ్రీహరిరావు, కంది శ్రీనివాసరెడ్డి, ఆడే గజేందర్, శ్యామ్ నాయక్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, మాజీ ఎంపీ సోయం బాపూరావ్, మాజీ ఎమ్మెల్యేలు రేఖానాయక్, ఆత్రం సక్కు, రాథోడ్ బాపూరావ్, నారాయణరావు పటేల్, జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, మాజీ జెడ్పీటీసీ గోక గణేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఏఐసీసీ సభ్యుడు నరేష్ రాథోడ్, ఆత్రం సుగుణ, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, జీసీసీ చైర్మన్ కోట్నాక్ తిరుపతి, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
విభేదాలతో పార్టీ నష్టపోయే పరిస్థితి
ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
‘హస్తం’ శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ దిశానిర్దేశం
బీజేపీ, బీఆర్‌ఎస్‌లను ఓడించాలి
స్థానిక సంస్థల ఎన్ని కల్లో బీజేపీ, బీఆర్‌ఎ స్‌లను ఓడించాలి. కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలి. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం కావాలి. పార్టీ ఎజెండాతోనే ముందుకెళ్లాలి.
– కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి
Comments
Please login to add a commentAdd a comment