ఇంటి నిర్మాణ పనులు అడ్డుకున్నారని..
● పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
● అడ్డుకున్న పోలీసులు
● జిల్లాకేంద్రంలో ఘటన
నిర్మల్‌టౌన్: ఇంటి నిర్మాణ పనులను మున్సిపల్ అధికారులు అడ్డుకుంటున్నారని ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానిక సోమవార్‌పేట్‌లో శక్కరి రమేశ్ ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు. దీనికి అనుమతులు లేవని టీపీవో హరీశ్ తరచూ వచ్చి వేధిస్తూ పనులు అడ్డుకుంటున్నాడు. విసుగు చెందిన కుటుంబీకులు శనివారం మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. పెట్రోల్ డబ్బా పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. వీరికి మద్దతుగా స్థానిక కౌన్సిలర్ మేడారం అపర్ణ–ప్రదీప్ బైఠాయించారు. మున్సిపల్ అధికారులు అందించిన సమాచారంతో పోలీసులకు అక్కడికి చేరుకున్నారు. తమ బాధను ఎవరూ పట్టించుకోకపోవడంతో రమేశ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు పెట్రోల్ డబ్బాను లాక్కున్నారు. తమ సమస్య పరిష్కరించకుంటే కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకుంటామని రమేశ్ తెలిపాడు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, కమిషనర్ ఖమర్ అక్కడికి చేరుకొని వారికి సర్దిచెప్పారు. అయినా రమేశ్ కొన్ని గంటలు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment