ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు
● రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
మంచిర్యాలఅగ్రికల్చర్: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి రవాణా ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర శాఖల అధికారులతో రహదారి భద్రత మాసోత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 31వరకు నిర్వహించనున్న రహదారి భద్రత మాసోత్సవాలను విజయవంతం చేసే దిశగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి వాహనదారులకు తెలిసే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ జిల్లాలో రోడ్డు భద్రత అవగాహన కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు భద్రతా ప్రమాణాలను విద్యార్థులకు పాఠ్యాంశాల్లో చేర్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రహదారి నిబంధనలు ఉల్లంఘించిన వారి లైసెన్స్ రద్దు చేసి భవిష్యత్‌లో మళ్లీ రాకుండా సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నామన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ రహదారి భద్రతా మాసోత్సవాలు జిల్లాలో విజయవంతం చేసే దిశగా కృషి చేస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా డ్రంకెన్ డ్రైవ్, తనిఖీ లు నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో ఏసీపీ ప్రకాష్, జిల్లా రవాణా శాఖ అధికారి సంతోష్‌కుమార్, రోడ్డు భవనాల శాఖ అధికారి రాము, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి, జిల్లా విద్యాధికారి ఎస్.యాదయ్య, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ అధికారి పురుషోత్తం నాయక్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment