ఆపదలో రాబందులు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రకృతి పారిశుద్ధ్య పక్షులుగా పిలిచే రాబందులు మనుగడ కోసం పోరాటం చేస్తున్నాయి. ఒకప్పుడు పల్లెల్లో మృత కళేబరం కనిపిస్తే గుంపులుగా వాలిపోయేవి. మానవ తప్పిదాలతో ప్రస్తుతం కనుమరుగుయ్యే పరిస్థితి వచ్చింది. చాలా కాలానికి 2013లో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలం నందిగామ శివారు తీరం పాలరాపు గుట్టపై పొడుగు ముక్కు(గిప్స్ ఇండికస్) రాబందులు అటవీ అధికారులకు కనిపించాయి. చిన్న, పెద్ద కలిపి 40వరకు ఉన్నట్లు అంచనా వేశారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని కమలాపూర్ రేంజీలో ఉన్న రాబందులు ప్రాణహిత నది దాటి ఇటువైపు వచ్చాయి. ఆ సమయంలో సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆరోగ్యకరమైన పశు కళేబరాన్ని గుట్టపై వేసేందుకు ప్రత్యేకంగా రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. ఓ బయాలజిస్టు వాచర్‌ను నియమించారు. అయితే రెండేళ్ల క్రితం భారీ వర్షాలకు గుట్టపై పక్షుల గూళ్లు చెదిరిపోవడంతో క్రమంగా సంచారం తగ్గింది. దీంతో ఈసారి చలికాలంలో వచ్చే వలసలు సైతం తగ్గిపోయాయి. ఇక్కడే కాకుండా నాగర్‌కర్నూల్ జిల్లా పదిర మండలం మద్దిమడుగు పరిసర క్రిష్ణ నది తీరంలోనూ రాబందులు కనిపించాయి. ఈ రెండు చోట్ల తప్ప తెలంగాణలో ఎక్కడా ఈ పక్షుల జాడ లేదు.
చావు దెబ్బతీసిన డైక్లోఫినాక్
పశువుల్లో రోగాల నివారణకు వాడే డైక్లోఫినాక్ రాబందుల జాతిని చావుదెబ్బ తీసింది. పశువులకు వేసిన ఇంజక్షన్లు అవి చనిపోయాక వాటిని భుజించిన రాబందులపై ప్రభావం చూపించాయి. ముఖ్యంగా పునరుత్పత్తి, జీవక్రియలపై ప్రభావంతో క్రమంగా వాటి సంఖ్య తగ్గుతూ వచ్చింది. గత రెండు దశాబ్దాల్లో వేలాదిగా ఈ పక్షులు చనిపోయాయి. ఆ తర్వాత ప్రభుత్వం డైక్లోఫినాక్‌ను నిషే ధించగా, అప్పటికే రాబందుల జాతి అంతరించే దశకు చేరింది. ప్రస్తుతం రాబందులు దేశంలో కొ న్ని చోట్లకే పరిమితం అయ్యాయి. మరోవైపు ప్రస్తుతం ఈ పక్షల సంచారం లేక పట్టణాలు, గ్రా మాల్లో పశువులు, జీవాల మృతకళేబరాలు ప్రకృతిలో నేరుగా కలుస్తూ నేల, నీరు, గాలిల్లో కలుస్తున్నాయి. దీంతో అనేక సంక్రమిత వ్యాధులకు కార ణం అవుతున్నట్లుగా పరిశోధనల్లో వెల్లడయ్యాయి.
ప్రతిపాదనల్లోనే జఠాయువు
రాబందుల రాకను గుర్తించిన అధికారులు మొదట సంరక్షణకు చర్యలు చేపట్టారు. నిధులేమి, రాబందుల రాక తగ్గిపోవడంతో అధికారులకు ఆసక్తి లేకుండా పోయింది. ప్రస్తుతం రెండు మూడు రాబందులు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎక్కుగా మహారాష్ట్ర వైపే అధికంగా ఉంటున్నాయి. కాగజ్‌నగర్ డివిజన్ పెంచికల్‌పేట, బెజ్జూరు మండలాల పరిసర ప్రాంతాన్ని జఠాయువు సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఇక్కడి అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా అమలుకు నోచుకోలేదు.
మనుగడ కోసం పోరాటం
చలికాలంలోనూ వలసల తగ్గుముఖం
Comments
Please login to add a commentAdd a comment