మళ్లీ పులి సంచారం?
● పిప్పల్‌కోటి శివారులో పశువులపై దాడి ● మూడు హతం.. రెండింటికి గాయాలు ● బెబ్బులిగా నిర్ధారించని అటవీ అధికారులు
తాంసి: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్‌కోటి శివారులో శనివారం పులి సంచారం కలకలం రేపింది. గ్రామ రైతులకు చెందిన పశువులపై పంట చేల సమీపంలో బెబ్బులి దాడి చేసి హతమార్చినట్లుగా భావించిన గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. అయితే వాటి కళేబరాల వద్ద పులి సంచరించిన ఆనవాళ్లు కనిపించకపోవడంతో వేరే అటవీ జంతువు హతమార్చి ఉండొచ్చని భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన రైతుల పశువులు రోజు మాదిరిగా శుక్రవారం గ్రాసం కోసం శివారులోని పంటచేల వైపు వెళ్లాయి. ఆయుబ్, నజీర్‌కు చెందిన పశువులు సాయంత్రం అయినా తిరిగి రాలేదు. దీంతో శనివారం ఉదయం వారు చేల వద్ద గాలించగా మూడు పశువులు పులి దాడిలో మృతి చెందినట్లు కనిపించాయి. మరో రెండింటికి గాయాలైనట్లు గుర్తించిన రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. బీట్ ఆఫీసర్ సాయి కుమార్ ఎనిమల్ ట్రాకర్స్‌తో అక్కడికి చేరుకున్నారు. మృతిచెందిన పశువుల కళేబరాలతో పాటు గాయపడిన వాటిని పరిశీలించారు. ఘటనా స్థలంలో పులి సంచరించినట్లు పాదముద్రలు, ఇతర ఆనవాళ్లు లభించకపోవడంతో వేరే ఇతర అడవి జంతువులు హైనా లేదా మరేదైనా హతమార్చి ఉండొచ్చని పేర్కొన్నారు. ఘటనా ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కదలికలను పరిశీలించనున్నట్లు తెలిపారు. అయినా రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీట్ ఆఫీసర్ వెంట ఎనిమల్ ట్రాకర్స్ కృష్ణ, సోనేరావు సిబ్బంది ఉన్నారు. కాగా ఏటా మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి పులులు వస్తూ ఈ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాయి. ఈ ఏడాది కూడా అక్కడి నుంచి పులి వచ్చిందేమోనని స్థానికులు భావిస్తున్నారు. పెన్‌గంగ పరీవాహక ప్రాంతాల వాసులు భయాందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment