బడి గంట కొట్టినా.. సార్లు రాలే!
● ఇష్టారాజ్యంగా విధులు ● 60 శాతం టీచర్లు బహుదూరపు బాటసారులే.. ● విద్యార్థులకు మాత్రం ఎఫ్‌ఆర్‌ఎస్.. పక్కాగా లెక్కలు
పాపన్నపేట(మెదక్): బడులకు గైర్హాజరవుతున్న టీచర్లను గాడిన పెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ 2024– 25 విద్యా సంవత్సరం నుంచి ‘ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్’ను అమల్లోకి తెచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌లో టీచర్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆప్షన్ సైతం ఇచ్చింది. స్మార్ట్ ఫోన్, ట్యాబ్‌లలో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి కెమెరా ఆధారంగా స్కాన్ చేయగానే హాజరు నమోదు చేయడం దీని ప్రత్యేకత. ఈ మేరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ట్యాబ్‌లు, జియో సిమ్‌లు అందజేసింది. వెంటనే ఉపాధ్యాయ యూనియన్లు నిరసన వ్యక్తం చేశాయి. ఇంతలో ఏమైందో ఏమో గాని టీచర్ల ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్ కనిపించకుండా పోయింది.
టీచర్లు 3,603.. పాఠశాలలు 966
జిల్లావ్యాప్తంగా 966 ప్రభుత్వ పాఠశాలలుండగా, 3,603 మంది టీచర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో 60 శాతం మంది దూరప్రాంతాల నుంచి తిరిగేవారే. చాలా మంది సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల నుంచి రోజూ వాహనాలపై పాఠశాలకు వస్తుంటారు. హెచ్‌ఎంలు అయితే ఖమ్మం, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట తదితర ప్రాంతాలకు చెందినవారు. కొంతమంది కలిసి కిరాయి కార్లలో విధులకు హాజరవుతుంటారు. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4, ఉన్నత పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి 4.15 వరకు పని చేయాలి. కానీ దూరం నుంచి వచ్చే టీచర్లు సమయపాలన పాటించడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా గిరిజన తండాల్లో పనిచేసే టీచర్లు 9 గంటలు దాటితే గాని బడికి వెళ్లరని, సాయంత్రం 4 వరకు బడిలో ఉండరనే ఆరోపణలున్నాయి. రోజుకు 100 నుంచి 150 కి.మీ ప్రయాణం చేసే టీచర్లు అలసిపోయి తరగతి గదిలో పాఠాలు చెప్పే పరిస్థితి కూడా ఉండడం లేదు. పాఠశాలలో వ్యక్తిగత అవసరాలకు సెల్‌ఫోన్ వాడకూడదనే నిబంధనలు ఉన్నా, చాలా మంది టీచర్లు, సెల్‌ఫోన్లతోనే ఎక్కువ కాలం గడుపుతున్నట్లు సమాచారం. ఇంతవరకు హాజరు రిజిస్టర్లలో సంతకాలు చేసే పద్ధతి అమల్లో ఉండడంతో కొంతమంది ఉపాధ్యాయులు పరస్పర అంగీకారంతో వచ్చిన తర్వాత గైర్హాజరు అయిన రోజు సంతకాలు పెట్టుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. మరికొంత మంది చిట్టీలు, ప్రైవేట్ ఫైనాన్స్‌లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఎల్‌ఐసీ, చిట్‌ఫండ్ ఏజెంట్లుగా పనిచేస్తూ విద్యాబోధనను గాలి కొదిలేస్తున్నట్లు తెలిసింది. విద్యార్థులకు ఎఫ్‌ఆర్‌ఎస్ విధానం అమల్లోకి తెచ్చి న పాఠశాల విద్యాశాఖ, టీచర్ల విషయంలో మాత్రం ఊగిసలాట ధోరణి కనబరుస్తుందనే విమర్శలున్నాయి. ఇటీవల ప్రతి మండలానికో ఎంఈఓను నియమిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు పాఠశాలల తనిఖీ అవకాశాలు కల్పించింది. అయినా ఆశించిన మార్పు రావడం లేదు. టీచర్లకు సైతం ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు చేయాలని పలువురు కోరుతున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటాం
ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎంఈఓలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తరచూ పాఠశాలలను తనిఖీ చేయాలి. మధ్యాహ్న భోజన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. టీచర్ల విషయంలో ఎఫ్‌ఆర్‌ఎస్ సిస్టం ఇంకా ఆచరణలోకి రాలేదు.
– రాధాకిషన్, డీఈఓ, మెదక్
Comments
Please login to add a commentAdd a comment