● జిల్లావాసుల ప్రధాన డిమాండ్‌గా ఎన్‌డీఎస్‌ఎల్ ● కొలిక్కిరాని ఘనపురం ఆనకట్ట పనులు ● మెదక్ రింగురోడ్డు, ఇతర సమస్యలపై దృష్టి సారించాలని ప్రజల వినతి ● ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి తొలిసారి మెతుకు సీమకు రాక
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/ మెదక్‌జోన్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి బుధవారం మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. ఏళ్ల తరబడి వివిధ సమస్యలతో సతమతమవుతున్న మెదక్ జిల్లా ప్రజలు ఈ పర్యటనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన ఇప్పుడు సీఎం హోదాలో జిల్లాకు వస్తున్నారు. సీఎం తన పర్యటనలో భాగంగా ఆయన ఏడుపాయల వనదుర్గ మాత ఆలయాన్ని దర్శించుకోనున్నారు. అక్కడే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం మెదక్‌లోని కేథడ్రల్ చర్చి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. సీఎం పర్యటన సందర్భంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు పూర్తి చేసింది.
ఏడుపాయలలో సరైన సౌకర్యాలేవి?
వనదుర్గామాత ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భక్తులు బస చేసేందుకు సత్రాల నిర్మాణం, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య నిర్వహణ కూడా దారుణంగా ఉంది. మురుగు కాల్వల నిర్మాణం లేవు. పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం నిర్వహణ అస్తవ్యస్తంగా మారాయి. సరిపడా మరుగుదొడ్లు కూడా లేవు ఉన్నవి నిరుపయోగంగా ఉన్నాయి. తాగునీరు డబ్బులు వెచ్చిస్తున్నారు. స్నానఘట్టాల వద్ద మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు లేవు. ఏటా రూ.పది కోట్ల వరకు ఆదాయం ఉన్నప్పటికీ ఈ క్షేత్రం వద్ద సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఏటా మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు తెలంగాణతో పాటు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్టాల నుంచి లక్షల్లో భక్తులు వస్తుంటారు. ప్రభుత్వం సైతం ఏటా రూ.కోటి చొప్పున నిధులు కేటాయిస్తోంది.
ఎటూ తేలని ఎన్‌డీఎస్‌ఎల్
జిల్లాలో ఏకై క చక్కెర కర్మాగారం మంబోజీపల్లి ఎన్‌డీఎస్‌ఎల్. ఇది టీడీపీ హయాంలో మూతపడడం విదితమే. దీన్ని పునః ప్రారంభించాలనే డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చింది. ఈ ఫ్యాక్టరీని ప్రారంభిస్తే ఇటు చెరుకు రైతులకు, మరోవైపు కార్మికులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి.
ఘనపురం ఆనకట్ట
జిల్లాలోని ప్రధాన సాగునీటి వనరుల్లో ఘనపురం ఆనకట్ట ఒకటి. ఎత్తు పెంపు పనులు ఏళ్లు గడుస్తున్నప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు. ప్రతిసారీ ఎన్నికల అప్పుడు ఈ అంశం తెరపైకి వస్తుంది. తర్వాత ఈ పనులు పూర్తి కావడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ఈ పనుల కోసం రూ.43 కోట్లు మంజూరు చేసినప్పటికీ ఈ పనులు ఇంకా కొలిక్కి రాలేదు. ప్రాజెక్టు ఎత్తు పెంచితే ముంపునకు గురయ్యే రైతులకు పరిహారం చెల్లింపుల విషయం ఎటూ తేలలేదు. దీంతో రూ.18 కోట్లు ఖర్చయినప్పటికీ ఆఫ్రాన్ నిర్మాణానికే పరిమితయ్యారు. ప్రస్తుతం 25 వేల ఎకరాలు సాగవుతున్నాయి. ఎత్తు పెంపు పూర్తి చేస్తే మరో 10 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది.
మెదక్ రింగ్ రోడ్డు..
మెదక్ పట్టణానికి రింగ్ రోడ్డు నిర్మాణం చేయాలనే డిమాండ్ చాలా రోజులుగా ఉంది. నేటికీ ఉత్సవాలు, పండుగలు జరిగినా ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయి. ఈ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఈ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
పాపన్నపేట–వెంకంపల్లి రోడ్డు..
కామారెడ్డి–మెదక్ జిల్లాలను అనుసంధానించే మంజీరా నదిపై బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. కానీ పాపన్నపేట వరకు ఉన్న రోడ్డు నిర్మాణం పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీనికి నిధులు మంజూరు చేయాలి. ఈ పనులు పూర్తయితే మెదక్ – కామారెడ్డి జిల్లాల మధ్య రాకపోకలకు దూరం తగ్గుతుంది. ప్రస్తుతం పాపన్నపేట మండల ప్రజలు కామారెడ్డి జిల్లాకు వెళ్లాలంటే మెదక్‌కు వచ్చి వెళ్లాల్సి వస్తోంది. ఈ రోడ్డు పూర్తయితే కేవలం 15 కి.మీలలోనే కామారెడ్డి జిల్లా పరిధిలోకి చేరుకోవచ్చని మెతుకు సీమ జిల్లా వాసులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment