సవాళ్లు.. మార్పులు!
మెదక్‌జోన్: 2024.. ఎన్నో రాజకీయ మార్పులు..సవాళ్లకు వేదికగా నిలిచింది. కొందరు నేతలకు కలిసొస్తే.. మరికొందరికి చేదు అనుభవాలను మిగిల్చింది. జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలు ఉండగా, గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో మెదక్ కాంగ్రెస్ వశం అయింది. నర్సాపూర్ బీఆర్‌ఎస్ ఖాతాలో చేరింది. మైనంపల్లి రోహిత్‌రావు, సునీతారెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. మదన్‌రెడ్డి నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయనకు కాకుండా బీఆర్‌ఎస్ అధిష్టానం సునీతారెడ్డికి టికెట్ కేటాయించింది. అనంతరం మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఊహించని తీర్పును ఇచ్చారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు పట్టం కట్టారు. ఎంపీ టికెట్‌ను ఆశించినా రాకపోవడంతో చివరి నిమిషంలో మదన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ను వీడి సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గత పాలనలో నియమించిన నామినేటెడ్ పోస్టులను రద్దు చేసింది. అందులో భాగంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ కుర్చీ ఖాళీ అయింది. ఒకరిద్దరు నేతలు పోటీపడినా కౌడిపల్లి మండలానికి చెందిన సుహాసినిరెడ్డిని పదవి వరించింది.
స్థానిక సంస్థలకు పర్సన్ ఇన్‌చార్జిల పాలన
మున్సిపాలిటీలు మినహా జిల్లా పరిషత్, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది ముగిసింది. జెడ్పీ చైర్మన్, మండల పరిషత్ అధ్యక్షులు, సర్పంచుల స్థానాల్లో ప్రభుత్వం పర్సన్ ఇన్‌చార్జీలను నియమించింది. దీంతో ఈ స్థానిక సంస్థలన్నీ ఇప్పుడు అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం మాత్రం 2025లో ముగియనుంది. ఈ ఏడాదే వీటికి ఎన్నికలు జరుగుతా యని భావించినప్పటికీ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఖరారు చేసేందుకు సమగ్ర సర్వే చేపట్టింది. దీంతో వచ్చే ఏడాదికి ఈ ఎన్నికలు వాయి దా పడినట్లయింది. ఇలా జిల్లాలో 2024లో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
మున్సిపాలిటీల్లో అవిశ్వాస పర్వం
జిల్లాలో మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ నాలుగు మున్సిపాలిటీలు ఉండగా.. గతంలో ఆ నాలుగు బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారే చైర్మన్లుగా కొనసాగారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీ పాలకవర్గాలకు అవిశ్వాస తీర్మా నం ప్రవేశపెట్టారు. తూప్రాన్‌లో గులాబీ పార్టీకి చెందిన రవీందర్‌గౌడ్‌పై అవిశ్వాసం నెగ్గి కాంగ్రెస్‌కు చెందిన మామిళ్ల జ్యోతి చైర్‌పర్సన్ అయ్యా రు. అలాగే నర్సాపూర్‌లో మురళీయాదవ్‌పై అవిశ్వాసం పెట్టగానే.. అతడు స్వయంగా రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్‌కు చెందిన కౌన్సిలర్ అశోక్‌గౌడ్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. మెదక్‌లో మాత్రం మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారి చైర్మన్ పదవిని కాపాడుకున్నారు. కాగా రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్ కొనసాగుతున్నారు.
ఊసేలేని ఆలయ పాలకవర్గాలు
రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన ఏడుపాయల దేవస్థానం పాలకవర్గం ఈఏడాది ఆగస్టు 6వ తేదీతో ముగిసింది. అలాగే కౌడిపల్లి మండలంలోని తునికి నల్లపోచమ్మ, సిక్లిందాపూర్ లక్ష్మీనరసింహ, దొంతి వేణుగోపాలస్వామి, చాకరిమెట్ల ఆంజనేయస్వామి ఆలయాలకు సంబంధించి నూతన పాలక మండలిని నియమించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment