ప్రైవేటీకరణ యత్నం మానుకోండి
మెదక్ కలెక్టరేట్: విద్యుత్ ప్రైవేటీకరణ వెంటనే నిలిపివేయాలని టీజీయూఈఈయూ, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శలు నర్సింహులు, రవీంద్ర ప్రసాద్‌లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యుత్ కార్యాలయం ఎదుట నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చండీగఢ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణలలోని డిస్కంలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు మొదలైనట్లు తెలిపారు. దాదాపు అన్ని రాష్ట్రాలలో స్మార్ట్ మీటర్లు నెలకొల్పడం ద్వారా దొడ్డిదారిన ప్రైవేటీకరించే ప్రయత్నాలు ఉపందుకున్నట్లు చెప్పారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యుత్ రంగా కార్మికులు వీరోచితమైన పోరాటం చేస్తున్నారని తెలిపారు. వారికి మద్దతుగా టీజీయూఈఈయూ–సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టామన్నారు. 2003లో విద్యుత్ చట్టానికి మార్పులు చేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా చండీగఢ్ విద్యుత్ రంగ కార్మికులు సమరశీలంగా పోరాడినట్లు గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం దక్షిణ హైదరాబాద్ సర్కిల్ విద్యుత్ పంపిణీ సేవలను అదానీ గ్రూప్‌నకు కట్టబెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులు ఆందోళనలు చేపట్టినట్లు తెలిపారు. ఇవాళ కేంద్రం రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తోందన్నారు. ఈ రంగ పరిరక్షణ కోసం పోరాడుతున్న కార్మికులు, ఇంజనీర్లకు మద్దతుగా ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున మద్దతును తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో చంద్రభాను, సురేశ్, శ్రీనివాస్, రమేశ్, సలీం, బాలకృష్ణ, నరేశ్, గౌరీకృష్ణ, పృథ్వీ, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఆందోళన
తూప్రాన్: కేంద్ర ప్రభుత్వం చండీగఢ్, ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే యత్నాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు ఊపందుకున్నాయని టీజీయూఈఈయూ సీఐటీయూ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఏ.మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం విద్యుత్ సబ్ డివిజన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. కేంద్రంలో మూడవసారి ఏర్పడిన మోదీ ప్రభుత్వం గతంలో కన్నా మరింత దూకుడుగా చండీగఢ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని డిస్కంలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు మొదలయ్యాయని ఆరోపించారు. ఆందోళనలో టీజీఎస్‌పీడీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వామి, శ్రీను, హనుమంతు, రాజు, రామకృష్ణ, వెంకటేశ్, భాగ్యరాజు, నవనీత, విజయ, శోభ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా
Comments
Please login to add a commentAdd a comment