పేరుకే పెద్దాసుపత్రి!
వైద్య సేవలు నామమాత్రం●
● భర్తీ కాని పోస్టులు, కొరవడిన సేవలు ● వందల సంఖ్యలో ఔట్ పేషెంట్లు ● పట్టించుకోని పాలకులు, అధికారులు
కార్పొరేట్ స్థాయిలో రూపుదిద్దుకున్న తూప్రాన్ (సామాజిక ఆరోగ్య కేంద్రం) ఆస్పత్రి మొక్కుబడి సేవలకు పరిమితం అయింది. పేదలకు వైద్య సదుపాయాలు అందని పరిస్థితి నెలకొంది. నామమాత్ర సేవలతో అత్యంత దారుణంగా పరిణమించింది. వైద్యులు, అరకొర సిబ్బంది వెరసి.. రోగులకు సేవలు అందించడంలో చతికిలపడిపోతుంది.
తూప్రాన్: పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలన్న లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తూప్రాన్, నర్సాపూర్‌కు 50 పడకల ఆస్పత్రులను మంజూరు చేశారు. తూప్రాన్ ఆస్పత్రి నిర్మాణం కోసం రూ. 11 కోట్లను మంజూరు చేసి 2018 జనవరి 17న ప్రారంభించారు. ఆస్పత్రిలో అన్నిరకాల వైద్యంతో పాటు మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఆస్పత్రి ప్రారంభించి ఏడేళ్లు కావొస్తున్నా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో వైద్యుల నియామకం జరగలేదు. తగిన వైద్య పరికరాలు ఏర్పాటు చేయలేదు. నిత్యం ఆస్పత్రికి సుమారు 400 మంది వరకు రోగులు వస్తున్నారు. నెలకు సుమారు 12 వేల మంది వివిధ జబ్బులకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే కేవలం సాధారణ వైద్యానికి మాత్రమే నోచుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యులు లేని కారణంగా గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆస్పత్రిలో 54 మంది సిబ్బంది ఉండాలి, కాని ప్రస్తుతం 13 మంది రెగ్యులర్ వైద్యులు, కాంట్రాక్టు పద్ధతిలో ముగ్గురు సేవలందిస్తున్నారు. కంటి వైద్య నిపుణుడు నర్సాపూర్‌కు వెళ్లగా.. చెవి, ముక్కు గొంతుకు సంబంధించిన వైద్యుడు ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఎముకల వైద్యుడు నర్సాపూర్ నుంచి డిప్యుటేషన్‌పై తూప్రాన్‌కు.. అక్కడి నుంచి మెదక్ ఆస్పత్రికి వెళ్లారు.
అదనంగా 14 పడకలు ఏర్పాటు
తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రిలో 50 పడకలకు అదనంగా మరో 14 పడకలు ఏర్పాటు చేశారు. ఇటీవల ఆస్పత్రిని కలెక్టర్ రాహుల్‌రాజ్ తనిఖీ చేశారు. ఆ సందర్భంలో రోగులకు తగిన పడకలు లేక ఇబ్బంది పడుతున్న విషయం గమనించారు. సీఎస్‌ఆర్ నిధులతో ప్రత్యేకంగా మరో 14పడకలు మంజూరు చే యించారు. దీంతో పడకల సంఖ్య 64కు పెరిగింది.
త్వరలో డయాలసిస్ సేవలు
ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన 14 పడకలతో పాటు డయాలసిస్ కేంద్రంలో 5 బెడ్లు ప్రారంభించేందుకు వైద్యులు సిద్ధం చేశారు. మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా ప్రారంభించాలని అధికారులు ఏర్పాట్లు చేశారు. మరో వారం రోజుల్లో మంత్రి ప్రారంభించిన వెంటనే డయాలసిస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 69 పడకలు రోగులకు అందుబాటులోకి వస్తే మరిన్ని వైద్య సేవలు అందే అవకాశం ఉంది.
తూప్రాన్ సామాజిక ఆరోగ్య కేంద్రం
త్వరలోనే సమస్య పరిష్కారం
ఆస్పత్రిలో వైద్యుల కొరత ఉన్న మాట వాస్తవమే. గత ప్రభుత్వం వైద్యుల నియామకం కోసం ఉత్తర్వులు జారీ చేసింది. కాని వైద్య సిబ్బంది నియామకం కాలేదు. దీంతో రోగులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించలేకపోతున్నాం. ఉన్న సిబ్బందితో రోగులకు సేవలు అందిస్తున్నాం. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం.
– అమర్‌సింగ్, ఆస్పత్రి సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment