ఎన్నాళ్లీ ఎదురుచూపులు..! | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లీ ఎదురుచూపులు..!

Published Sat, Apr 20 2024 1:20 AM

ఉపాధి పనులు చేస్తున్న కూలీలు - Sakshi

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న టెక్నికల్‌ అసిస్టెంట్లకు మూడు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. చాలీచాలని వేతనాలతో కొన్ని సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకంలో టెక్నికల్‌ అసిసెంట్లు (టీఏ)గా పనిచేస్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లోని కూలీలకు పనులు కల్పించి, బిల్లుల రికార్డు నమోదు చేయడంలో టీఏలు కీలకంగా వ్యవహరిస్తారు. మూడు నెలల నుంచి వేతనాలు రాక వారికి కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనుల పర్యవేక్షణ, పనుల ప్రదేశంలో కొలతలకు టెక్నికల్‌ అసిస్టెంట్లు నిత్యం వెళ్లాల్సి ఉంటుంది. వేతనాలు రాకపోవడంతో రవాణా ఖర్చులకు కూడా తీవ్ర ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు.

పెరిగిన పనిభారం..

జిల్లాలో 174 గ్రామ పంచాయతీలకు గాను 29 మంది టెక్నికల్‌ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడటంతో ప్రస్తుతం పనిచేస్తున్న టెక్నికల్‌ అసిస్టెంట్లకు పనిభారం పెరిగింది. కొత్త జీపీలు ఏర్పాటైనా గత ప్రభుత్వం నూతనంగా టెక్నికల్‌ అసిస్టెంట్లను నియమించలేదు. ఉన్న టీఏలతోనే పనులు నెట్టుకొస్తున్నారు. వేసవికాలంలో గ్రామాల్లో వ్యవసాయ పనులు లేకపోవడంతో కూలీలు ఎక్కువగా ఉపాధి పనుల వైపు మొగ్గుచూపుతారు. జీపీల వారీగా టీఏల సంఖ్య తక్కువగా ఉండటంతో ఉన్న పని భారాన్ని వారిపై పడుతోంది. ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు పని ఒత్తిడిని అధిక మించినా.. సమయానికి వేతనాలు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

మూడు నెలలుగా నిరీక్షణ..

ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న టెక్నికల్‌ అసిస్టెంట్లు మూడు నెలలుగా వేతనాల కోసం నిరీక్షిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న టెక్నికల్‌ అసిస్టెంట్లకు సరైన సమయానికి వేతనాలు రాకపోవడంతో వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. వచ్చే కొద్దిపాటి వేతనంతోనే కుటుంబ పోషణ చూసుకునే టీఏలు, మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో అప్పుల పాలుకావాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మూడు నెలల పెండింగ్‌ వేతనాలతో పాటు ప్రతీ నెల వేతనాలు అందించేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

ఇబ్బందులు పడుతున్నాం..

మూడు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నాం. ప్రతీ నెల వేతనాలు చెల్లిస్తే కుటుంబ పోషణ అ వసరాలకు ఉపయోగపడే వి. పనుల ప్రదేశానికి వెళ్లేందుకు రవాణా ఖర్చులు కూడా ఇబ్బందిగా మారా యి. టెక్నికల్‌ అసిస్టెంట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో పనిభారం పెరిగింది. వేతనాలు రాకపోవడంతో అప్పులు తెచ్చి అవసరాలు తీర్చుకుంటున్నాం. ప్రభుత్వం వెంటనే వేతనాలు చెల్లించాలి.

– రాజ్‌కుమార్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌

ఈజీఎస్‌ టెక్నికల్‌ అసిస్టెంట్లకు అందని వేతనాలు

కనీస అవసరాలకు

అప్పులు చేయాల్సిన పరిస్థితి

ఇబ్బందులు పడుతున్న టీఏలు

జిల్లాలో 29 మంది టెక్నికల్‌ ఉద్యోగులు

మండలం జీపీల టీఏల

సంఖ్య సంఖ్య

ములుగు 32 04

వెంకటాపురం (ఎం) 23 03

గోవిందరావుపేట 18 03

తాడ్వాయి 18 03

ఏటూరునాగారం 12 03

కన్నాయిగూడెం 11 03

మంగపేట 25 03

వాజేడు 17 04

వెంకటాపురం(కె) 18 03

మొత్తం 174 29

1/1

Advertisement
Advertisement