పశుగణన.. ఆన్‌లైన్ నమోదు
ములుగు రూరల్ : గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పశు సంపదకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పశువుల పాత్ర కీలకం. భూ మిలేని అనేక మంది కుటుంబాలకు ప్రాథమిక ఆ దాయ వనరు పశువులే అని చెప్పడంలో అతిశయో క్తి లేదు. ప్రభుత్వం అక్టోబర్ 25 నుంచి 2025 ఫిబ్రవరి 29 వరకు పశు గణన నిర్వహించడానికి పశుసంవర్ధకశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. పశుగణనలో 16 రకాల పశుజాతుల వివరాలు సేకరించనున్నారు. పశుగణనలో భాగంగా తెల్లజాతి పశువులైన ఆవులు, ఎద్దులు, గేదెజాతి పశువులు, గొర్రెలు , మేకలు, పందులు, గుర్రాలు, గాడిదలు, కుక్కలు, పెంపుడు కుక్కలు, ఒంటెలు, పొట్టి గుర్రాలు, కుందేళ్లు, ఏనుగులు, కోళ్ల రకాలను లెక్కించనున్నారు.
ఐదేళ్ల్లకోసారి లెక్కింపు..
పశుగణన 1919వ సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి ఐదు సంవత్సరాలకోసారి పశుగణన లెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు 20 సార్లు పశుగణన చేపట్టారు. 2019లో జరిగిన పశుగణనలో జిల్లాలో తెల్లజాతి పశువులు 70,126, గేదెలు 48,109, గొర్రెలు 91,869, మేకలు 56,303, పందులు 585 మొత్తం 2,66,992 నమోదు చేశారు. 21వ పశుగణన నాలుగు నెలల పాటు కొనసాగనుంది. ములుగు జిల్లాలోని తొమ్మిది మండలాలలో మొత్తం 174 గ్రామ పంచాయతీల్లో 99,459 ఇళ్లను సర్వే చేయనున్నారు. 29 మంది పశుగణన కర్తలు, 9 మంది పర్యవేక్షకులు, ఇద్దరు నోడల్ అధికారులు సర్వేలో పాల్గొననున్నారు. పశుగణనతో జిల్లాలో ఏఏ రకాల పశువులు ఉన్నాయనే విషయం తెలవడంతో పాటు వైద్య చికిత్స, సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందుల సరఫరా సులభతరంగా ఉంటుందని అన్నారు. రైతులకు ఆర్థికపరమైన సబ్సిడీ రుణాల అందించడం కోసం, డెయిరీ ఫాం మంజూరు చేసేందుకు ఉపయోగపడుతాయని అన్నారు.
తొలిసారి ఆన్‌లైన్..
పశుగణన గ్రామాలు, పట్టణాలు, డెయిరీ, కోళ్లు, గొర్రెల ఫాం, దేవాలయాలు, గోశాలలు, పశు వైద్యకళాశాలల్లో సర్వే నిర్వహిస్తారు. ఎన్యుమరేటర్లు జిల్లాలోని అన్ని ఇళ్లను సందర్శించి పూర్తి సమాచారాన్ని తీసుకుంటారు. సర్వే నిర్వహించిన ప్రతి ఇంటికీ స్టిక్కరింగ్ చేస్తారు. పశు పోషణలో ఉన్న రైతులు, కుటుంబాల వివరాలను సేకరించడంతోపాటు పశువుల వయసు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. మొదటిసారి ఆన్‌లైన్‌లో పశుగణన వివరాలను నమోదు చేపడుతున్నారు. సర్వే పారదర్శకంగా నిర్వహిస్తున్నారా.. లేదా.. అంచనా మేరకు నమోదు చేస్తున్నారా.. అనే విషయంపై పశువైద్యాధికారులు, సూపర్‌వైజర్లు వ్యవహరిస్తూ పర్యవేక్షిస్తారు. సర్వే వివరాలను నోడల్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తారు.
పశుగణనకు రైతులు
సహకరించాలి
పశుగణనకు రైతులు, ప్రజలు సహకరించాలి. రైతుల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పశుగణనను చేపడుతోంది. పశుగణన ఆధారంగా జిల్లాలో ఉన్న పశువులకు టీకాలు, వ్యాధి నివారణ మందులు సరిపడా అందేలా చూస్తాం.
– కొమురయ్య,
జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి
●
జిల్లాలో 99,459 ఇళ్ల సర్వే
ఐదేళ్లకోసారి లెక్కింపు..
16 రకాల పశుజాతుల నమోదు
2025 ఫిబ్రవరి నాటికి పూర్తి
Comments
Please login to add a commentAdd a comment