ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజనతో భరోసా
ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా
ఏటూరునాగారం : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జీవన జ్యోతి (పీఎంజేజే) బీమా యోజనను అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఈ పథకం పేదలకు భరోసా ఇస్తుందని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 ఏళ్లనుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఏదైనా బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్‌లో ఆధార్‌తో అనుసంధానమైన సేవింగ్స్ ఖాతా కలిగి ఉండాలన్నారు. ఏడాదికి రూ.436లు ప్రీమియం చెల్లించాలని, ఆటోమెటిక్ డెబిట్ సౌకర్యం కూడా ఉంటుందన్నారు. మరణం సంభవిస్తే రూ.2 లక్షలు సాయం వర్తిస్తుంది. అలాగే 18 ఏళ్లనుంచి 70 ఏళ్లలోపు వారు సంవత్సరానికి రూ.20లు ప్రీమియం చెల్లిస్తే మరణం సంభవిస్తే రూ. 2లక్షలు, పాక్షికంగా అంగవైకల్యం కలిగితే రూ.లక్ష బీమా వర్తిస్తుంది. ఈనెల 22వ తేదీన ఐటీడీఏ కార్యాలయంలో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు పీఓ పేర్కొన్నారు. బీమా కావాల్సిన వారు వారి ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌పుస్తకం, నామిని వివరాలు, బ్యాంక్ అకౌంట్ లింక్ ఉన్న మొబైల్‌ను వెంట తీసుకురావాలని కోరారు.
జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలి
ములుగు : జిల్లాలోని ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించి వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని గిరిజన జర్నలిస్టులు తెలిపారు.ఈ మేరకు ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బానోత్ వెంకన్న ఆధ్వర్యంలో నాయకులు బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా అక్రిడిటేషన్ కమిటీలో ప్రాధాన్యం కల్పించాలని మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే ఐటీడీఏ ద్వారా సంక్షేమ పథకాలలో అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూక్య సునీల్, పోరిక శరత్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న వైద్యశిబిరం
ములుగు రూరల్ : మండలంలోని జంగాలపల్లి గ్రామంలో మూడో రోజు ఉచిత వైద్యశిబిరం కొనసాగింది. ఈ శిబిరంలో పలు వ్యాధులపై జిల్లా వైద్యాధికారి గోపాలరావు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపాల్‌రావు మాట్లాడుతూ ప్రజలు వైద్యశిబిరాలను వినియోగించుకోవాలన్నారు. బీపీ, షుగర్, మలేరియా, డెంగీ వంటి ఆరోగ్య సమస్యలు ఉంటే శిబిరానికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మూడో రోజు వైద్య బృందాలు గ్రామంలో పర్యటించి, వ్యాధులపై అవగాహన కల్పించారు. బుధవారం ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో 145 మందికి వైద్యసేవలు, 32 మంది రక్త నమూనాలు సేకరించారు. కార్యక్రమంలో జిల్లా శిశు సంరక్షణ, వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ రణధీర్, సైక్రియాటిస్ట్ డాక్టర్ నమ్రత, వైశాలి, నవ్య రాణి, ఇన్‌చార్జ్ మాస్ మీడియా అధికారి సంపత్, అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ దుర్గారావు, ఎంఎల్‌హెచ్‌పీఎస్ నవ్య, దీపిక, ఆరోగ్య విస్తరణ అధి కారి సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
పగిలిన పైపులైన్..
ఎగిసిన నీరు
కాటారం: కాటారం మండల కేంద్రానికి సమీపంలో భూపాలపల్లి వైపుగా జాతీయ రహదారిని ఆనుకొని కేటీపీపీకి నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన పైపులైన్ గేట్ వాల్వ్ బుధవారం పగిలిపోవడంతో నీరు ఒక్కసారిగా ఎగిసిపడింది. కాళేశ్వరం సమీపంలోని గోదావరి నుంచి చెల్పూర్ సమీపంలోని కేటీపీపీకి నీటి సరఫరా కోసం గతంలో భారీ పైపులైన్ ఏర్పాటు చేసి అక్కడక్కడ పెద్ద గేట్‌వాల్స్ అమర్చారు. నీటి పీడనం కారణంగా మండల కేంద్రానికి సమీపంలో గేట్‌వాల్వ్ పగిలిపోవడంతో పెద్ద ఎత్తున నీరు బయటకు వచ్చింది. సుమారు గంట పాటు నీరు వృథాగా పారింది. సమాచారం అందుకున్న సిబ్బంది నీటి సరఫరాను నిలిపివేశారు.
Comments
Please login to add a commentAdd a comment