సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
ములుగు: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల పరి ష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని, సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సీహెచ్ మహేందర్ జీ అధికారులకు తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అదనపు కలెక్టర్ రెవెన్యూ మహేందర్‌జీ, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఇన్‌చార్జ్ సంపత్‌రావు, ఆర్డీఓ వెంకటేష్‌లతో కలిసి దరఖాస్తులను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి, ప్రజాదర్భార్‌కు సంబంధించిన దరఖాస్తులను నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు వచ్చిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పరిష్కరించాలన్నారు. సోమవారం రెవెన్యూ శాఖకు సంబంధించి 13, ఫించన్ కోసం 1, ఇందిరమ్మ ఇండ్ల కోసం 5, ఉద్యోగ ఉపాధి కోసం 2, ఇతర శాఖలకు సంబంధించి 14 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఓ ప్రకాశ్, డీసీఓ సర్ధార్ సింగ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, డీసీఎస్‌ఓ షాఫైజల్ ఉస్సేనీ, డీఎం డీసీఎస్‌ఓ రాంపతి, ఏటీడీఓ దేశీరామ్, డీడబ్ల్యూఓ శిరీషా ఉన్నారు.
ఐటీడీఏ కార్యాలయంలో..
ఏటూరునాగారం: గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై సెక్టార్ అధికారులు దృష్టి సారించాలని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన దర్భార్‌లో వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్, డీటీ అనిల్, ఆర్‌సీఓ హర్సింగ్, ఏఈ ప్రభాకర్, డీటీలు కిషోర్, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని..
● భూపాలపల్లి జిల్లాకు చెందిన సంజీవ ట్రైనింగ్ ఇప్పించాలని వేడుకున్నారు.
● ఫిబ్రవరిలో జరిగే మినీ మేడారంలో జాతరకు ఆదివాసీ తెగల సమ్మేళన బిల్లును ఇప్పించాలని వట్టం ఉపేందర్ కోరారు.
● మంగపేటలోని పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ ఇసుక క్వారీ సొసైటీ బిల్లులను విడుదల చేయాలని గిరిజనులు విన్నవించారు.
● చెల్పాక గ్రామంలో చాట్ల సమ్మక్క పేరుమీద ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా ఇప్పించాలని కోరారు.
● మంగపేట మండలం పగిడిపల్లిలో సీసీ రోడ్డు నిర్మించాలని బద్దుల లక్ష్మి వేడుకున్నారు.
● మంగపేట మండలం శనిగకుంటలో ఊరచెరువు మరమ్మతులకు మంజూరు చేయాలని రైతులు తాటి నర్సింహారావు ఇతరులు కోరారు.
● బోరునర్సాపురంలో అక్రమ ఇసుక తవ్వకాలకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని తాటి నాగరాజు కోరారు.
● మంగపేట మండలం చుంచుపల్లిలో డీఆర్ సేల్స్‌డిపో పోస్టు ఇప్పించాలని పెడెం నాగేశ్వర్‌రావు కోరారు.
● పోడు పట్టాల భూములకు సీఎం గిరివికాసం స్కీం కింద బోర్‌వెల్ మంజూరు చేయాలని భూపాలపల్లి జిల్లా నందిగామ ప్రాంతానికి చెంది 90 మంది రైతులు పీఓకు విన్నవించారు.
● భూపాలపల్లి జిల్లా రామన్నగూడెం గ్రామంలో గిరివికాసం బోరు మంజూరు చేయాలని రైతు బానోతు రాములు, వసంత, మాలోని వేడుకున్నారు.
● గురుకులంలో అటెండర్ పోస్టు ఇప్పించాలని మల్లంపల్లికి చెందిన ప్రతాప్ విన్నవించారు.
అదనపు కలెక్టర్ మహేందర్ జీ
ప్రజావాణిలో 35 దరఖాస్తులు
ఇందిరమ్మ ఇళ్ల సర్వేకు సహకరించాలి
ములుగు: జిల్లా ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో పాల్గొని సరైన సమాచారం అందించి సహకరించాలని కలెక్టర్ దివాకర టీఎస్ సోమవారం కోరారు. ప్రజాపాలన ఆరు గ్యారంటీల్లో భాగంగా నాలుగవ గ్యారంటీ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారి వివరాలను సేకరించి మొబైల్ యాప్‌లో నమోదు చేయనున్నట్లు తెలిపారు. గతంలో ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్న వారి ఇంటి వద్దకే వచ్చిన సిబ్బందికి స్థల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు తదితర వివరాలు అందించాలని కోరారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలను సంప్రదించి సందేహాల నివృత్తి చేసుకోవాలని లేదంటే కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూం నంబర్ 18004257109ను సంప్రదించాలని కలెక్టర్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment