జాతర పనులు త్వరగా పూర్తిచేయాలి
క్యూలైన్లను పరిశీలిస్తున్న కలెక్టర్ దివాకర
నేతాజీగూడెంలో సర్వేను పరిశీలిస్తున్న కలెక్టర్
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ మినీ జాతర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మండల పరిధిలోని మేడారంలో కలెక్టర్ గురువారం ఆకస్మికంగా పర్యటించారు. దేవాదాయశాఖ క్యూలైన్, జంపన్నవాగు వద్ద స్నాన ఘట్టాలు, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినీ మేడారం జాతరను పురస్కరించుకుని వేలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంలో పారిశుద్ధ్యం లోపించకుండా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రపరచాలని సూచించారు. భక్తులు క్యూలైన్‌లో గద్దెల ప్రాంతానికి వెళ్తున్న సమయంలో తోపులాట జరగకుండా చూసుకోవాలన్నారు. అక్కడ తాగునీరు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలని, గద్దెల ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. జంపన్న వాగు ప్రాంతంలో పుణ్య స్థానాలు ఆచరించిన అనంతరం మహిళలు దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలని, మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రపర్చాలని సూచించారు. నాలుగు రోజుల పాటు జరిగే మినీ మేడారం జాతరకు ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని దీనిని దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట డీపీఓ దేవరాజ్, ఎంపీడీఓ సుమనవాణి, పంచాయతీ కార్యదర్శి సతీష్ పాల్గొన్నారు.
సర్వేను పారదర్శకంగా చేయాలి
గోవిందరావుపేట: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 4 సంక్షేమ పథకాల క్షేత్రస్థాయి సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర అన్నారు. మండల పరిధిలోని పస్రా గ్రామపంచాయితీ పరిధిలో నేతాజీగూడెంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల విచారణ ప్రక్రియను కలెక్టర్ దివాకర గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు పథకాల అమలుకు జిల్లాలో సర్వే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఈ సర్వేలో భాగంగా పర్యవేక్షణకు అన్ని మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. విచారణ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వివరాలను సేకరిస్తున్నాయని వెల్ల డించారు. సర్వేకు ప్రజలు సహకరించాలని సూచించారు. సర్వేలో ఏమైనా సమస్యలు తలెత్తితే కారణాలను రాయాలని సూచించారు. 20వ తేదీ వరకు సర్వే జరుగుతుందని తెలిపారు. 21 నుంచి 24 వరకు గ్రామసభలు నిర్వహించి అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నట్లు వెల్లడించారు. షెడ్యూల్డ్ ప్రకారం సర్వే, గ్రామ సభలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జవహర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్వేత, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర
Comments
Please login to add a commentAdd a comment